ఇల్లెందు, మార్చి 14: మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో ఇల్లెందు పట్టణంలోని జగదాంబ సెంటర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద శుక్రవారం పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకొని రాజేందర్‌తోపాటు ఉద్యమ నాయకులు, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ బావ్‌సింగ్, ఆదూరి రవిలను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
దీంతో పోలీసుల చర్యను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. ఠాణా ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దిండిగాల రాజేందర్ మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. టీబీజీకేఎస్ నాయకుడు రంగనాథ్ మాట్లాడుతూ ప్రశ్నించే గొంతు నొక్కినంత మాత్రాన పోరాటం ఆగదన్నారు. బీఆర్ఎస్ నాయకులు సిలివేరి సత్యనారాయణ, పరుచూరి వెంకటేశ్వర్లు, పార్టీ సోషల్ మీడియా విభాగం, యూత్ నాయకుడు ఎంటెక్ మహేందర్, కాసాని హరిప్రసాద్, లలిత్ పాసి, సత్తాల హరికృష్ణ, నాయకులు సురేశ్, చాంద్‌పాషా, నారపాక వసంత, మునిగంటి శివ తదితరులు పాల్గొన్నారు.