ఖమ్మం, డిసెంబర్ 3 : తెలంగాణ ఉద్యమకారుడు, అమరజీవి శ్రీకాంతాచారి త్యాగం మరువలేనిదని, ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ నాయకులు అన్నారు. మంగళవారం ఖమ్మం నగరంలోని తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఆదేశాల మేరకు శ్రీకాంతాచారి వర్థంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రీకాంతాచారి ప్రాణత్యాగం తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిందన్నారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేకమంది తెలంగాణ బిడ్డల ప్రాణాలను బలి తీసుకున్నదని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, న్యాయవాది, ఉద్యమకారులు బిచ్చాల తిరుమలరావు, డోకుపర్తి సుబ్బారావు, మేకల సుగుణారావు, నిరోషా, రాజేష్, బలుపు మురళి, బెల్లం వేణు పాల్గొన్నారు.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం 2009 డిసెంబర్ 3న తన ప్రాణాలను అర్పించిన కాసోజు శ్రీకాంతాచారి త్యాగం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని బీఆర్ఎస్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో పేరొన్నారు. శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆయన త్యాగాన్ని స్మరించుకుంటూ, నాడు కేసీఆర్ అరెస్టుకు నిరసనగా నవంబర్ 29న ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న శ్రీకాంతాచారి ఐదురోజులపాటు గాయాలతో పోరాడి, చివరకు డిసెంబర్ 3, 2009న జై తెలంగాణ నినాదంతో తుదిశ్వాస విడిచారు అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకాంతాచారి చేసిన ఆత్మార్పణం తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తుందని, తెలంగాణ ఉద్యమ విజయానికి ఆయన త్యాగం స్ఫూర్తిగా నిలిచిందన్నారు. మనమంతా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని పేర్కొన్నారు.