ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రచారం హోరెత్తుతోంది. నామినేషన్ల దాఖలు ప్రక్రియకు ముందే ఎన్నికల ప్రచారం ప్రారంభించిన బీఆర్ఎస్.. పోలింగ్ సమయం సమీపిస్తుండడంతో వేగం పెంచింది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ సహా ఏడు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండాలు ఎగురవేయాలనే లక్ష్యంతో ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ముందుకుసాగుతున్నారు. వ్యూహ ప్రతివ్యూహాలతో ప్రత్యర్థి పార్టీల కంటే ముందువరుసలో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా రాష్ట్ర అధినాయకత్వం ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేక ఇన్చార్జులను నియమించింది. అభ్యర్థుల విజయానికి ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది.
వైరా మున్సిపాలిటీలో బీఆర్ఎస్ విజయం కోసం రాష్ట్ర మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఇన్చార్జి బాధ్యతలు తీసుకొని విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలుకొని ప్రచారం వరకు అన్నింటినీ స్వయంగా పర్యవేక్షిస్తూ ఎన్నికల ప్రచారాన్ని విస్తృతస్థాయిలో నిర్వహిస్తున్నారు. ఏదులాపురం మున్సిపాలిటీపై తొలిసారిగా బీఆర్ఎస్ పాగా వేసేందుకు ఆ పార్టీ నేతలు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటూ శ్రేణుల్లో భరోసా నింపుతూ అభ్యర్థుల విజయం కోసం పాటుపడుతున్నారు. ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జిగా బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి ఇక్కడ ప్రత్యేక దృష్టి సారించారు.
ఇక్కడ బీఆర్ఎస్, సీపీఎం కలిసిపోటీ చేస్తుండడం ఇరుపార్టీలకు కలిసి వచ్చే అవకాశం. అదే సమయంలో సీపీఐ, కాంగ్రెస్ వేర్వేరుగా పోటీ చేస్తుండడం కూడా బీఆర్ఎస్ కూటమికి విజయావకాశాలు మరింత మెరుగయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మధిర మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జిగా ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్‌రాజు నేతృత్వంలో మధిరలో బీఆర్ఎస్ గెలుపే లక్షంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన కల్లూరు మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నేతృత్వంతో పార్టీ నాయకులు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు.
కల్లూరు మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జిగా భద్రాద్రి జిల్లా గ్రంథలయ సంస్థ మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ వ్యవహరిస్తున్నారు. సత్తుపల్లిలో గత ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీఆర్ఎస్.. ఈసారి కూడా అదే ఒరవడి కొనసాగించేలా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో ముందుకెళ్తోంది. సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జిగా డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషయ్య వ్యవహరిస్తున్నారు. ఇల్లెందు మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకునే విధంగా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, ఎన్నికల ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ కలిసి.. వామపక్ష నేతల పొత్తుతో ముందుకెళ్తున్నారు. నూతనంగా ఏర్పడిన అశ్వారావుపేట మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగురవేసేందుకు ప్రతి వార్డులోనూ పార్టీ అభ్యర్థులతో కలిసి పార్టీ ఇన్చార్జి ఉప్పల వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలంటూ అభ్యర్థిస్తున్నారు.
ఎన్నికల నిర్వహణలో అనుభవం ఉన్న సీనియర్ నేతలకు మున్సిపల్ ఎన్నికల బాధ్యత అప్పగించడంతో పార్టీ అభ్యర్థులకు మరింత భరోసా లభించినట్లయింది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ గెలుపు బాధ్యతలను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావులకు అప్పగించడంతో కార్పొరేషన్‌లోని 60 డివిజన్లలో పార్టీ అభ్యర్థుల విజయం కోసం వారు ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి, గత బీఆర్ఎస్ సర్కారు చేసిన అభివృద్ధి గురించి ప్రతి ఓటరుకూ వివరిస్తున్నారు.