ఖమ్మం, సెప్టెంబర్ 11: మున్నేరు వరద బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఇటీవల ఖమ్మం మున్నేరు వరదల్లో సర్వం కోల్పోయిన 1,718 మంది కుటుంబాలకు నగరంలోని నయాబజార్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రెండో రోజు సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూ.1.50 కోట్ల విలువైన చెకులను మంత్రి పంపిణీ చేసి మాట్లాడారు. మున్నేరు ముంపు బాధితులకు నిత్యావసరాలు, గృహోపకరణాలు అందించినట్లు తెలిపారు. ఐటీసీ సహకారంతో బాధితులకు రూ.కోటి విలువైన స్టీల్ సామాన్లు, పరుపులు ఇచ్చినట్లు చెప్పారు. గృహావసరాల కోసం వస్తువులు పంపిణీ చేస్తున్నామన్నారు.
మున్నేరు బాధితుల సహాయార్థం రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి రూ.కోటి, తన కోడలు అపర్ణ ఆమె తండ్రి, తాత కంపెనీ నుంచి రూ.50 లక్షలు అందించినట్లు చెప్పారు. ఈ రూ.1.50 కోట్ల మొత్తం కలెక్టర్ ఖాతాలో జమ కాగా వాటిని బాధితులందరికీ సమానంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఎంపీ బండి పార్థసారథిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. గతంలో గ్రేటర్ హైదరాబాద్‌లో వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం రూ.10 వేలు పంపిణీ చేసిందని గుర్తుచేశారు. కానీ ఖమ్మంలో మున్నేరు బాధితుల్లో ఒక్కో కుటుంబానికి ఐటీసీ అందించిన రూ.కోటి విలువైన వస్తు సామగ్రితో కలుపుకొని రూ.15 వేల చొప్పున అందుతున్నట్లు తెలిపారు. వరదల సమయంలో తమ పువ్వాడ ఫౌండేషన్ ద్వారా బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు కూడా పంపినీ చేశామని గుర్తుచేశారు. వరదల్లో ఇక్కడి ప్రజలు ఏం కోల్పోయారో ఈ నగదుతో అవి మళ్లీ కొనుగోలు చేసుకోవచ్చునని అన్నారు.
మున్నేరు పరీవాహక ప్రాంతంలోని ముంపు బాధితులకు ఇక ఇబ్బందులు రావని స్పష్టం చేశారు. మున్నేరుకు ఇరువైపులా రూ.690 కోట్లతో ఆర్సీసీ రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని, అతి త్వరలోనే శంకుస్థాపన చేసి ఆ పనులకు ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు. మున్నేరుపై బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జి పకనే రూ.180 కోట్లతో తీగల బ్రిడ్జిని నిర్మిస్తామన్నారు. మొన్నటి వరకు బికుబికుమంటూ నివాసమున్న మున్నేరు పరీవాహక ప్రాంత ప్రజలు గర్వపడేలా రానున్న రోజుల్లో మున్నేరును పర్యాటక ప్రాంతంలా తీర్చిదిద్దుతామని అన్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. ఐటీసీ అందించిన రూ.కోటి విలువైన గృహోపకరణాలను బాధిత కుటుంబాలకు ఇప్పటికే అందించినట్లు చెప్పారు.
అనంతరం మంత్రి, విద్యా శాఖ సమగ్ర శిక్ష అభియాన్, అలిమ్ కో ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉచితంగా పరికరాలను పంపిణీ చేశారు. రూ.8 లక్షలతో కొనుగోలు చేసిన రెండు బోట్లను మత్యశాఖ అధికారులకు మంత్రి అందజేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు కొండబాల కోటేశ్వరరావు, కూరాకుల నాగభూషణం, బచ్చు విజయ్‌కుమార్, దోరేపల్లి శ్వేత, జీ.గణేశ్, సీహెచ్ స్వామి, తోట గోవిందమ్మ రామారావు, మాటేటి లక్ష్మీనాగేశ్వరరావు, మేడారపు వెంకటేశ్వర్లు, ఆళ్ల అంజిరెడ్డి, ఆర్జేసీ కృష్ణ, తోట రామారావు, పగడాల నాగరాజు, రుద్రగాని ఉపేందర్, కన్నం ప్రసన్నకృష్ణ, మామిడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.