నమస్తే నెట్వర్క్, ఆగస్టు 22 : పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ కుట్రకు నిరసనగా శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు.
పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపు మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్య, డిప్లొమా కోర్సులను కొత్తగా ఏర్పడిన శక్తి విభాగం, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి విలీనం చేయాలని ఈ జీవో ప్రతిపాదిస్తోందని, తక్షణమే ఈ జీవోను నిలిపివేయాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 75వేల పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అవుతుందన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడొద్దని, వారి భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టడం సరికాదని పేర్కొన్నారు.
సాంకేతిక విద్యను నిర్వీర్యం చేసేందుకు రేవంత్రెడ్డి సర్కార్ కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో రాష్ర్టాన్ని సర్వనాశనం చేస్తున్నదని ధ్వజమెత్తారు. విద్యార్థుల ఆందోళనలకు బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా ఉంటుందని ప్రకటించారు. జీవో 97ను రద్దు చేయకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.