ఖమ్మం, జూలై 10: ‘పొంగులేటీ, ముస్తాఫా.. పిచ్చి మాటలు మాట్లాడొద్దు. మంత్రి పువ్వాడపై పొంతనలేని ఆరోపణలు చేస్తే.. ఇకపై చూస్తూ ఊరుకోం. తగిన బుద్ధి చెబుతాం..’ అంటూ మాజీ ఎంపీ పొంగులేటి, కాంగ్రెస్ నాయకుడు ముస్తాఫాపై బీఆర్ఎస్ మైనార్టీ విభాగ నాయకులు, కార్పొరేటర్లు హెచ్చరించారు. తొమ్మిదేళ్లుగా ఖమ్మాన్ని తీర్చిదిద్దుకున్న మంత్రి అజయ్‌ను విమర్శించడమంటే అభివృద్ధిని అడ్డుకోవడమేనని స్పష్టం చేశారు. ఖమ్మం నగరంలోని మంత్రి పువ్వాడ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేటర్ మక్బూల్, బీఆర్ఎస్ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు తాజుద్దీన్, నాయకులు ఖమర్, షౌకత్ అలీ, ముక్తార్, మజీద్, ముజాహిద్, మెహబూబ్ అలీ, షకీనా, షంశుద్దిన్ మాట్లాడారు. స్థాయిని మరిచి మంత్రి పువ్వాడపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని, ఈ సారి గట్టిగానే సమాధానం చెబుతుమని అన్నారు. గడిచిన తొమ్మిదేళ్లుగా మంత్రి అజయ్‌కుమార్ ఖమ్మాన్ని ఎలా తీర్చిదిద్దారో కన్పించలేదా? అని ప్రశ్నించారు. ఇకమీరు కొత్తగా వచ్చి చేసేదేముందని అన్నారు. మీతో కలిసి ఉన్న వాళ్లకే మళ్లీ కండువాలు కప్పడం, వాళ్లనే మళ్లీ చేర్చుకున్నామంటూ ప్రకటించుకోవడం సిగ్గుచేటని అన్నారు. వార్డు స్థాయి కూడా లేని ముస్తాఫా.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడని, అతడిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వ్యక్తిగత విమర్శలు ఎంతవరకు సబబో వారే విజ్ఞతతో ఆలోచించుకోవాలని సూచించారు. మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్‌కుమార్, ఉస్మాన్ పాల్గొన్నారు.