ముదిగొండ, మే 3: అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులు.. వాటిని అమలుచేయకుండా ఈ ఎన్నికల్లో ఓట్లెలా అడుగుతారని ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు. అవాకులు చెవాకులు పేలుతున్న కాంగ్రెస్ పాలకులు.. జిల్లాలో తాను చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉండాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముదిగొండలో సోమవారం నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. జిల్లాకు జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి పనుల కోసం అనేక నిధులు తెచ్చానని వివరించారు. ఓ రైతుబిడ్డగా, అన్ని వర్గాల కష్టాలు తెలిసిన వాడిగా పనిచేస్తున్నానని అన్నారు. ఈ ఎన్నికల్లో తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. సాగు మొదలుపెట్టే సమయం నుంచి పంటను విక్రయించే సమయం వరకూ అన్ని దశల్లోనూ గత కేసీఆర్ ప్రభుత్వం కర్షకులకు అండగా ఉంటూ వచ్చిందని గుర్తుచేశారు. కానీ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను అరిగోసపెడుతోందని విమర్శించారు.
ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు మాట్లాడుతూ.. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేసిన వారితో జిల్లా ప్రజలకు ఒరిగేదేమీ లేదని విమర్శించారు. బయటి నుంచి వచ్చినవారు ఎప్పటికీ టూరిస్టులు మాత్రమే అవుతారని ఆరోపించారు. ఇక్కడ పోటీ చేయించడానికి కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులే దొరకలేదా? అని ప్రశ్నించారు. ముగ్గురు మంత్రులు ఉండి స్థానికులకు సీటు సాధించుకోలేక పోయారని విమర్శించారు. హామీల గురించి అడిగితే దేవుళ్లపై ఒట్లు పెడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ.. పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని అన్నారు. కానీ కాంగ్రెస్ వచ్చిన ఈ ఐదు నెలల కాలంలోనే రాష్ట్రం అధోగతి పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఉండి పదవులు అనుభవించిన కొందరు నేతలు.. పొద్దుతిరుగుడు పువ్వులాగా నేడు అధికారం ఎటువైపు ఉంటే అటు వైపు తిరుగుతున్నారని విమర్శించారు.
టీఎస్ సీడ్స్ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ.. అదృష్టంకొద్దీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులు.. హామీలు అమలు చేయకుండా కేవలం అబద్ధాలతోనే నెట్టుకొస్తున్నారని విమర్శించారు. ఇకపై ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు వినే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు బొమ్మెర రామ్మూర్తి, వాచేపల్లి లక్ష్మారెడ్డి, పసుపులేటి దుర్గ, మీగడ శ్రీనివాస్‌యాదవ్, మందరపు ఎర్ర వెంకన్న, తోట ధర్మారావు, గడ్డం వెంకటేశ్వర్లు, పచ్చ సీతారామయ్య, పోట్ల రవి, నీరుకొండ సతీశ్, బత్తుల వెంకట్రావు, పసుపులేటి వెంకట్, అమడాల జక్కర్, రామారావు తదితరులు పాల్గొన్నారు.