కొత్తగూడెం అర్బన్, ఆగస్టు 5: తెలంగాణ రాష్ట్ర రైతుల వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు అని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. కరువుకాటకాలతో అల్లాడిన రాష్ట్ర ప్రజానీకం కోసం మాజీ సీఎం కేసీఆర్ ముందుచూపుతో నిర్మించిన ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలను తెలియజేసేందుకు మాజీ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన పవర్‌పాయింట్ ప్రజంటేషన్ (పీపీటీ)ను కొత్తగూడెంలోని పార్టీ జిల్లా కార్యాలయంలోని ఎల్ఈడీ తెరపై ప్రత్యక్ష ప్రసారం చేశారు.
జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై ఈ పీపీటీని సావధానంగా విన్నారు. అనంతరం రేగా కాంతారావు మాట్లాడుతూ కాళేశ్వరంపై వేసిన ఘోష్ కమిషన్ పూర్తిగా కాంగ్రెస్ కమిషన్‌గా పనిచేసిందని ఆరోపించారు. అది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కమిషన్ రిపోర్టు మాత్రమేనని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బతుకుదెరువు కోసం వలసపోయిన తెలంగాణ ప్రజలు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తిరిగొచ్చి వ్యవసాయం చేసుకొని గౌరవంగా బతుకుతున్నారని గుర్తుచేశారు.
ఇతర రాష్ర్టాల నుంచి సైతం లక్షలాది మంది వచ్చి తెలంగాణలో పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారని జ్ఞప్తికి తెచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని, అందుకే అధికారంలోకి వచ్చిన సుమారు రెండేళ్లలో రూ.2 లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ నేతలు దిండిగాల రాజేందర్, కాపు సీతాలక్ష్మి, అనుదీప్, మానె రామకృష్ణ, మంతపురి రాజుగౌడ్, కొట్టి వెంకటేశ్వర్లు, సిలివేరు సత్యనారాయణ, జయరాం, కాంపెల్లి కనకేష్పటేల్, సింధు తపస్వీ, పోతురాజు రవి, పూజిత, భూపతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.