ఖమ్మం, ఫిబ్రవరి 14: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలందరూ ఇప్పుడు బాధపడుతూ ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు గాదరి వీరస్వామి, అన్నపర్తి పరశురాం, సురేశ్‌లతోపాటు 30 కుటుంబాలకు చెందిన వారు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఖమ్మంలోని తెలంగాణ భవన్లో శుక్రవారం జరిగిన ఈ చేరికల కార్యక్రమంలో వీరికి ఎమ్మెల్సీ తాతా మధు గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తాతా మధు మాట్లాడుతూ.. బీఆర్ఎస్లో చేరిన వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు విని ఆ పార్టీకి ఓట్లు వేశామని, కేసీఆర్‌ను ఓడించడం వల్ల రాష్ర్టానికి అన్యాయం జరుగుతున్నదని భావించి కాంగ్రెస్‌ను వీడుతున్నామని ఆ పార్టీ నాయకులు, ప్రజలు అంటున్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నదని వివరించారు. కేసీఆర్ పాలనను ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదని విమర్శించారు.
కేసీఆర్ పాలనే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని, బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరిగిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనను భవిష్యత్‌కు పెనుప్రమాదంగా భావిస్తూ.. కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరుతున్నట్లు పలువురు కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. బీఆర్ఎస్ తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాల అధ్యక్షులు బాషబోయిన వీరన్న, బెల్లం వేణు, నాయకులు దీవల శ్రీనివాసరావు, పోట్ల జగదీశ్, పోట్ల నాగేశ్వరరావు, అనపర్తి ఉప్పలయ్య, అన్నపర్తి ఎల్లయ్య, సందరబోయిన పాపారావు, ఇండ్ల సురేశ్ తదితరులు పాల్గొన్నారు.