భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వర్తించినందుకు నెలనెలా ఠంచనుగా వేతనం తీసుకుంటున్నా.. అది చాలదనట్లు ఆమ్యామ్యాలకు మరిగి కొందరు అధికారులు పక్కచూపులు చూస్తున్నారు. పని ఏదైనా సదరు బాధితుల నుంచి రూ.వేలు, లక్షల్లో డిమాండ్ చేస్తూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోతున్నారు.
ఏడాది కాలంలోనే పది మంది ఉద్యోగులు ఏసీబీ అధికారులకు పట్టుబడి పవిత్ర భద్రాద్రి జిల్లాకు అవినీతి మరకలు అంటించారు. ఒక శాఖలో అధికారి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారనే భయం కూడా లేకుండా లంచాలే ప్రధాన ధ్యేయంగా వివిధ శాఖల్లో కొందరు అధికారులు, సిబ్బంది పని చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బాధ్యతగా పనిచేసిన అధికారులు.. కాంగ్రెస్ పాలనలో కొందరు అధికారులు, సిబ్బంది బరితెగించి లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కుతున్నారు. ప్రభుత్వ కొలువే కదా.. తమను సర్వీసు తొలగించేది ఎవరనే ధీమాతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తున్నది.
గత కేసీఆర్ పాలనలో పదేళ్లు అంతా సాఫీగా సాగిపోయింది. వివిధ శాఖల్లో సామాన్యుల సమస్యలను అధికారులు వెనువెంటనే పరిష్కరించేవారు. కానీ.. కాంగ్రెస్ పాలన షురువైన నాటినుంచి పైరవీలకే ప్రథమ ప్రాధాన్యం అనేలా ఉంది పరిస్థితి. కిందిస్థాయి సిబ్బందిపై ఉన్నతాధికారుల అజమాయిషీ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అవినీతి అక్రమాలకు పెద్దపీట వేసినైట్లెంది. కనీసం కలెక్టరేట్ భవన సముదాయంలో విధులు నిర్వర్తిస్తున్నామనే భయం కూడా లేకుండా ఓ హార్టికల్చర్ అధికారి ఏకంగా రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే. ఇలా ఏడాదిలోపే పది మందికిపైగా ఉద్యోగులు ఏసీబీ వలలో చిక్కుకొని ఊచలు లెక్కిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నా.. అధికారులకు ఎలాంటి భయంలేకుండా లంచాలు తీసుకోవడంలో పెట్రేగిపోతున్నారు.
జిల్లాలో రోజురోజుకూ లంచావతారులు ఎక్కువవుతున్నారు. ఒక శాఖ అని కాదు.. అన్ని శాఖల్లోనూ అదే తీరు కనిపిస్తున్నది. డిప్యూటేషన్ల పేరుతో, విద్యుత్ శాఖలో ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, ఫిర్యాదుదారులు ఠాణాకు వెళ్తే డబ్బులు డిమాండ్ చేయడం, దొడ్డిదారిలో బదిలీలు చేయడంతోపాటు సెలవులు కావాలన్నా, ఇంక్రిమెంట్లు చేయాలన్నా లంచాలకు మరింత డిమాండ్ పెరిగింది. ట్రెజరీ కార్యాలయాల్లో కూడా కమీషన్లు బాగా పెరిగినట్లు ఉద్యోగులే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. వీటిపై ఏసీబీ అధికారులు మరింత దృష్టి సారిస్తే చాలా శాఖల ఉద్యోగులు కూడా చిక్కే అవకాశాలు లేకపోలేదు.
లంచం ఇచ్చే స్థాయి, స్తోమత లేక పలువురు బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. లంచం అడుగుతున్నారని మాకు సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతున్నాం. అధికారులు ఫోన్లో లంచం అడిగినా తప్పే అవుతుంది. కాల్ రికార్డులను సైతం పరిశీలిస్తున్నాం. రేగళ్ల పంచాయతీ కార్యదర్శిని అలాగే పట్టుకున్నాం. జిల్లాలో ఏడాదిలోపే 10 మందిని అరెస్టు చేశాం. ఇంకా చాలా మంది బాధితులు మాకు ఫోన్లు చేస్తున్నారు. – రమేశ్, డీఎస్పీ ఏసీబీ
పోటీపడి లంచాలు తీసుకుంటూ కొందరు అధికారులు, ఉద్యోగులు ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నారు. భద్రాద్రి జిల్లాలో ఏడాదిలోపే 10 మంది ఉద్యోగులు ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారంటే లంచగొండులు ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.