క్వింటా ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామంటూ అన్నదాతలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ తరువాత వారిని అడుగడుగునా మోసం చేస్తోంది. తొలుత ‘క్వింటా వడ్లకు రూ.500 బోనస్’ అంటూ ఎన్నికల్లో మాట ఇచ్చిన రేవంత్.. తీరా గెలిచాక ‘సన్న వడ్లకే రూ.500 బోనస్’ అంటూ మాట మార్చారు. అలా గత సీజన్‌కు ఎగనామం పెట్టిన సీఎం రేవంత్.. ఇప్పుడు సన్న వడ్లు పండించి విక్రయించిన రైతులకూ సకాలంలో బోనస్ జమ చేయకుండా పంగనామాలు పెడుతున్నారు. ఇటీవల ముగిసిన యాసంగిలో కూడా ఖమ్మం జిల్లా రైతుల నుంచి సన్న వడ్లను కొనుగోలు చేసిన కాంగ్రెస్ సర్కారు.. తాజాగా వానకాలం సీజన్ మొదలైనా బోనస్ ముచ్చట ఎత్తింది లేదు. సకాలంలో జమ చేసిందీ లేదు. దీంతో యాసంగి బోనస్ నగదుతోనైనా వానకాలం పంటలకు పెట్టుబడి పెట్టుకుందామనుకున్న అన్నదాతలకు నిరాశ తప్పడం లేదు.
-రఘునాథపాలెం, జూన్ 24
ఇటీవలి యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోళ్ల సమయంలో అన్నదాతలను అష్టకష్టాలు పెట్టింది కాంగ్రెస్ సర్కారు. వరి కోతలు మొదలైన వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. ఆలోపే అకాల వర్షాలు కురవడంతో కల్లాల్లోని ధాన్యమంతా తడిసిపోయింది. కొట్టుకుపోయింది. దీంతో అన్నదాతలకు తీరని నష్టం మిగిలింది. తర్వాత తీరిగ్గా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ వాటిల్లో సౌకర్యాలు కల్పించకపోవడం, టార్పాలిన్లు అందుబాటులో ఉంచకపోవడం, గన్నీ బస్తాలు తగినన్ని సమకూర్చకపోవడం, కాంటాలను సకాలంలో పూర్తి చేయకపోవడం, తేమ శాతం పేరుతో రోజుల తరబడి ధాన్యాన్ని ఆరబోయించడం వంటి కారణాలతో కొనుగోళ్లను మరింత జాప్యం చేసింది. దీంతో విరామం లేకుండా అకాల వర్షాలు కురవడంతో కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యమంతా తడిసి ముద్దయింది. కొన్ని చోట్ల తడిచి ముద్దయింది.
మరికొన్ని చోట్ల మొలకెత్తింది. ఫలితంగా అన్నదాతలు ఆసాంతం నష్టపోయారు. ఈ కష్టాలన్నింటినీ దాటుకొని, ధాన్యాన్ని భద్రంగా కాపాడుకొని ప్రభుత్వానికి విక్రయించిన కర్షకులకు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ చుక్కలు చూపిస్తోంది. చివరికి బోనస్ నగదు కూడా సకాలంలో ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతోంది. యాసంగిలో ధాన్యాన్ని విక్రయించిన వెంటనే ధాన్యం నగదును, బోనస్ నగదును రైతుల ఖాతాల్లో జమ చేయాల్సిన ప్రభుత్వం.. నెలల తరబడి జాప్యం చేస్తూ వస్తోంది.
ధాన్యం నగదును కూడా చాలా రోజులకు జమ చేసిన రేవంత్ సర్కారు.. బోనస్ సొమ్మును మాత్రం ఇప్పటికీ విడుదల చేయలేదు. దీంతో యాసంగిలోనే తమ రెక్కల కష్టానికి బోనస్ ఫలాన్ని అందుకోని అన్నదాతలు.. నేటికీ ఆ నగదు కోసం కళ్లలో ఒత్తులేసుకొని మరీ ఎదురుచూస్తున్నారు. ఇంతలో వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో ఇప్పటికైనా బోనస్ వస్తుందేమో, దానితో ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేసుకుందామేమో, పంటల పెట్టుబడికి వినియోగించుకుందామేమో అనే అన్నదాతల ఆశలు నెరవేరేలా లేవు. బోనస్ నగదు ఎప్పుడు జమ అవుతాయంటూ కార్యాలయాలకు పరుగులు పెట్టి అడిగినా సరైన సమాధానం లేదు.
వానకాలం వచ్చినా బోనస్ పెండింగ్
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి లబ్ధిపొందిన కాంగ్రెస్.. ఇప్పుడు మాత్రం అదే బోనస్‌ను పెండింగ్ పెట్టి అన్నదాతలను అష్టకష్టాల పాలు చేస్తోంది. ధాన్యం కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా, సీజన్లు దాటిపోతున్నా వడ్లను విక్రయించిన రైతులకు మాత్రం బోనస్ నగదును జమ చేయడం లేదు. కేవలం బోనస్ నగదే ఖమ్మం జిల్లా రైతులకు రూ.63.53 కోట్లను పెండింగ్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. వానకాలం సీజన్ మొదలై వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నప్పటికీ బోనస్ జమ చేసిన పాపాన పోలేదు. బోనస్ జమ అయితే నాట్లకైనా, కూలీలకైనా ఇచ్చేందుకు అక్కరకొస్తాయనుకున్న అన్నదాతల ఆశలు అడియాశలవుతున్నాయి.
12.70 లక్షల క్వింటాళ్ల కొనుగోలు
ఖమ్మం జిల్లాలో ఇటీవలి యాసంగి ధాన్యాన్ని ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసింది. మొత్తం 18,855 మంది రైతుల నుంచి 12,70,653 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించింది. అయితే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన తక్షణమే వారి ఖాతాల్లో నగదును జమ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ మాటను కూడా తప్పింది. గత బీఆర్ఎస్ సర్కారులో ధాన్యం విక్రయించిన రైతుకు 48 గంటల్లోనే దాని నగదు అతడి బ్యాంకు ఖాతాలో జమ అయ్యేది. కానీ.. కాంగ్రెస్ సర్కారులో మాత్రం రోజులు, నెలల వ్యవధి పట్టింది. ఇక బోనస్ విషయం మాత్రం మరీ దయనీయం. యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యానికి ఇవ్వాల్సిన బోనస్‌ను వానకాలం ప్రారంభమైనా ఇవ్వలేదు. దీంతో అన్నదాతలందరూ నిత్యం తమ బ్యాంకు ఖాతాల్లో నిల్వలను పరిశీలించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.