కారేపల్లి, జులై 13 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని రామలింగాపురం(కారేపల్లి క్రాస్ రోడ్డు)లో ఆదివారం ఆషాఢమాస బోనాల వేడుకను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఉదయం గ్రామంలోని గ్రామదేవత(ఎర్రమ్మ తల్లి)కు మహిళలు నీళ్లు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యువతులు, మహిళలు బోనాలు తలపై ఎత్తుకొని గ్రామంలోనీ వీధుల నుండి ఊరేగింపుగా బయలుదేరారు. మేళతాళాలు, డప్పు నృత్యాలు మధ్య మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో గ్రామంలో తిరిగి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి పూజలు నిర్వహించారు.
నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఎర్రమ్మ తల్లి దేవాలయానికి రంగులు వేయించి విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. బోనాల వేడుకల్లో దేవతామూర్తుల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా కారేపల్లి క్రాస్ రోడ్ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులంతా కులమతాలకతీతంగా గ్రామ నడిబొడ్డులో గల ఎర్రమ్మ తల్లి దేవాలయం వద్దకు చేరుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.