చికిత్స పొందుతూ ఆ పార్టీ కార్యకర్త సాయిగణేశ్ మృతి
పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
రెచ్చిపోయి ప్రభుత్వ ఆసుపత్రిపై దాడి చేసిన బీజేపీ నేతలు
అద్దాలు ధ్వంసం కావడంతో భయాందోళన చెందిన రోగులు
బస్సు అద్దాలు పగులగొట్టడంతో బెంబేలెత్తిన ప్రయాణికులు
టీఆర్ఎస్ ఫ్లెక్సీలు చించి దహనం చేసిన కాషాయ శ్రేణులు
ఆందోళనకారుల దాడిలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు
ఖమ్మంలో బీజేపీ నేతలు రెచ్చిపోయారు. శవ రాజకీయాలకు తెర లేపారు. ప్రశాంతంగా ఉన్న నగరంలో అలజడి సృష్టించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి భయాందోళనకు గురి చేశారు. బీజేపీ కార్యకర్త సాయిగణేశ్ చౌదరి మృతి నగరంలో ఉద్రిక్తతకు దారి తీసింది. మూడురోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సాయి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మధ్యాహ్నం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకొని విధ్వంసానికి పాల్పడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రిపై మూక దాడి చేసి అద్దాలు పగులగొట్టారు. దీంతో రోగులు, వారి బంధువులు భయాందోళనకు గురయ్యారు. ఆందోళనకారులను అడ్డుకున్న కానిస్టేబుల్‌పై దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ బీజేపీ నేతలు కార్యకర్తలను రెచ్చగొడుతూ విద్వేషాలు రేకెత్తిస్తూ వారిని ఆత్మహత్యల వైపు పురిగొల్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మామిళ్లగూడెం, ఏప్రిల్ 16: బీజేపీ నగర కార్యకర్త సాయిగణేశ్ చౌదరి మృతిని సాకుగా చూపి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఖమ్మంలో వీరంగం సృష్టించారు. ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను సృష్టించారు. మూడు రోజుల క్రితం ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సాయిగణేశ్ని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మరణించారు. దీంతో ఖమ్మంలో బీజేపీ కార్యకర్తలు హడావిడి చేసి ఆందోళనలకు దిగారు. శనివారం మధ్యాహ్నం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన సమయంలో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద ఆద్దాలను ధ్వంసం చేశారు. అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
వైరా రోడ్డులో డివైడర్ల వద్ద ఏర్పాటు చేసిన మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, కేటీఆర్ ఫ్లెక్సీలను చించివేసి ధ్వంసం చేశారు. మమత ఆసుపత్రి రోడ్డులోని ఫ్లెక్సీకి నిప్పంటించారు. శవపరీక్ష పూర్తి చేసిన వెంటనే తీవ్ర ఉద్రిక్తతల మధ్య మృతదేహాన్ని కలెక్టరేట్ వద్ద ఉంచి ధర్నా చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మృతదేహాన్ని ఎక్కువ సేపు ఉంచడం శ్రేయస్కరం కాదని పోలీసులు నచ్చజెప్పి నేరుగా కాల్వొడ్డులోని వైకుంఠధామానికి తరలించారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న సమయంలో పాత బస్టాండ్ నుంచి ఇల్లెందు క్రాస్ రోడ్డు వైపు ప్రయాణికులతో వెళ్తుతున్న ఆర్టీసీ బస్సు అద్దాలను కాషాయ నేతలు ధ్వంసం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర నుంచి ఇల్లెందు క్రాస్ రోడ్డు వరకు ఉన్న టీఆర్ఎస్ ఫ్లెక్సీలను ధ్వంసం చేసి దహనం చేశారు. ఈ క్రమంలో వాహనదారులపైనా దురుసుగా ప్రవర్తించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైనా వారు దౌర్జన్యానికి దిగారు. ఎదురుదాడిలో పోలీసులు కిందపడిపోయారు.
భారీ బందోబస్తు..
ఏడీసీపీ సుభాశ్ చంద్రబోస్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంతోపాటు మంత్రి అజయ్ క్యాంపు కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం, జిల్లా ప్రధాన ఆసుపత్రి వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.