ఖమ్మం, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ వారిని తమ ఏజెంట్లుగా మార్చిన నీచ చరిత్ర కేంద్ర ప్రభుత్వానిదని కేరళ ముఖ్యమంత్రి, సీపీఎం జాతీయ నాయకుడు పినరయి విజయన్ ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలో లేని రాష్ర్టాల్లో గవర్నర్లను ఏజెంట్లుగా మార్చుకొని అక్కడి ప్రభుత్వాలపై ఉసిగొల్పుతున్నదని ఆరోపించారు. ఖమ్మంలో గురువారం నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 3వ మహాసభల బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు.
చివరికి ఉన్నత విద్యపైనా కర్రపెత్తనం చేయాలనే దురుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల్లో గవర్నర్ల ద్వారా తమ ప్రయత్నాలను ప్రారంభించిందని ఆరోపించారు. కేరళ వంటి రాష్ర్టాలు ఈ తరహా ధోరణిని వ్యతిరేకించాయని గుర్తుచేశారు. కాంగ్రెస్, బీజేపీలు దొందూదొందేనని దుయ్యబట్టారు. 1991లో కాంగ్రెస్ అమలు పరిచిన ఆర్థిక సరళీకృత విధానాలనే ఇప్పుడు బీజేపీ కూడా అమలు చేస్తోందని, దీనికి అదనంగా మతోన్మాదాన్ని పేరేపిస్తోందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ముమ్మాటికీ రైతు వ్యతరేక ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం ఆ పార్టీకి ఎప్పుడూ పట్టలేదని విమర్శించారు.
పీఎం కేసాన్ పథకం కూడా బీజేపీ ఎన్నికల స్టంటేనని ఆరోపించారు. 2019లో తెలంగాణలో ఈ పథకం కింద 39.10 లక్షల మంది రైతులు లబ్ధిదారులు ఉంటే.. 2022 నాటికి వారిని 24 లక్షలకు కుదించిందని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు.. ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించడమే పనిగా పెట్టుకున్నదని, ఈ విక్రయాల ద్వారా రూ.65 వేల కోట్లు సమకూర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. ఈ క్రమంలో రూ.11 లక్షల కోట్లను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేసిందని దుయ్యబట్టారు.
కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల ఇప్పటికే కోటి మంది రైతులు వ్యవసాయానికి దూరమయ్యారని, దేశంలో ప్రతిరోజూ 16 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో తామే బలమైన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న కాంగ్రెస్.. ప్రజల పక్షాన పోరాడకపోగా బీజేపీకి రిక్రూట్మెంట్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ఈజీఎస్‌ను నిర్వీర్యం చేస్తూ పని దినాల సంఖ్యను తగ్గిస్తోందని ఆరోపించారు. హిందీ భాషను అందరిపైనా రుద్దడానికి కేంద్రం ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. ఇలాంటి జాతి వ్యతిరేఖ శక్తులను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని కోరారు. సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆ పార్టీ నేతలు నాగయ్య, వెంకట్, జూలకంటి రంగారెడ్డి, సీతారాములు, నున్నా నాగేశ్వరరావు, పోతినేని సుదర్శన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈ క్రమంలో ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాడే లౌకిక, ప్రజాతంత్ర శక్తులతో కలిసి పని చేస్తామన్నారు. దేశ ప్రజల ఐక్యతకు విఘాతం కలిగిస్తూ మతం, కులం పేరుతో వారి మధ్య చిచ్చుపెట్టి లబ్ధిపొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తమ స్వార్థ రాజకీయాల కోసం ముస్లింలు, క్రైస్తవులు, దళితులపై దాడులు చేస్తున్నదని దుయ్యబట్టారు. ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలున్న తెలంగాణలో ఆ పార్టీ ఎలా అధికారంలోకి వస్తుందని అమిత్‌షాను ప్రశ్నిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించడం వెనుక ఈ కుట్రే ఉన్నదని తెలిసిందేనన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ బలమైన పోరాటం చేస్తున్నారు కనుకనే ఆయనతో కలిసి నడుస్తున్నామని అన్నారు.పొత్తుల గురించి ఎన్నికల సందర్భంలోనే నిర్ణయిస్తామన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీ.వెంకట్ మాట్లాడుతూ.. కార్పొరేట్ వ్యవసాయాన్ని తీసుకొచ్చి రైతులను సాగుకు దూరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని విమర్శించారు.