ఇల్లెందు, సెప్టెంబర్ 11 : భద్రాద్రి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో బేస్మెంట్ల నిర్మాణాలు చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మొదటి విడత రూ.లక్ష బిల్లు ఇంకా మంజూరు కాలేదు. దీంతో లబ్ధిదారులందరూ ముప్పుతిప్పలు పడుతున్నారు. నిర్మాణాలు పూర్తిచేసి 50 రోజులవుతున్నా మొదటి విడత బిల్లులు జమ కాకపోవడంతో తదుపరి నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. దీంతో అప్పటికే ఉన్న పాత ఇళ్లను కూల్చివేసి కొత్తగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులు.. ఆ పక్కనే గుడారాలు వేసుకొని నివసిస్తున్నారు.
ఇటీవలి వర్షాలకు వారు ఆ గుడారాల్లో అష్టకష్టాలు పడుతున్నారు. మొదటి విడత బిల్లులు వస్తే తదుపరి నిర్మాణాలను వేగిరం చేసి త్వరగా గృహప్రవేశాలు చేసుకోవచ్చనుకున్న లబ్ధిదారులకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. ప్రభుత్వం పెట్టిన షరతులు, హౌసింగ్ అధికారులు చెబుతున్న కారణాలు లబ్ధిదారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ‘అన్ని తిప్పలు పెట్టేకంటే అసలు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకపోయినా మంచిదేమో’ అనుకుంటూ అరిగోస పడుతున్నారు.
పేదల సొంతింటి కలను తామే నిజం చేస్తామంటూ గొప్పలకు పోయిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. నిబంధనల పేరుతోనూ, బిల్లుల జాప్యంతోనూ లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా మున్సిపాలిటీల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారుల గోస అంతా ఇంతా కాదు. భద్రాద్రి జిల్లాలో కొత్తగూడెం (పాల్వంచతో కలిపి మున్సిపల్ కార్పొరేషన్), ఇల్లెందు, మణుగూరు, అశ్వారావుపేట మున్సిపాలిటీలున్నాయి.
వీటిల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారుల్లో 241 మంది బేస్మెంట్ లెవెల్ వరకూ నిర్మాణాలు పూర్తిచేశారు. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం బేస్మెంట్ నిర్మాణం పూర్తయిన (యాప్‌లో ఫొటోను అప్లోడ్ చేశాక) వారం రోజుల్లోనే (అంటే ప్రతీ సోమవారం) ప్రతి లబ్ధిదారుడికీ మొదటి విడత కింద రూ.లక్ష బిల్లు అతడి బ్యాంకు ఖాతాలో జమ కావాల్సి ఉంది. కానీ మున్సిపాలిటీల్లోని లబ్ధిదారులు బేస్మెంట్ లెవెల్ నిర్మాణాలు పూర్తిచేసి 50 రోజులవుతున్నా మొదటి విడత బిల్లులు మాత్రం ఇంత వరకూ మంజూరు కావడం లేదు.
పట్టణాల్లో బేస్మెంట్ లెవెల్ నిర్మాణాలు పూర్తయినప్పటికీ మొదటి విడత రూ.లక్ష బిల్లు రాకపోవడంతో తదుపరి నిర్మాణాలు నిలిచిపోయాయి. అయితే, తాము బేస్మెంట్ నిర్మాణాలు పూర్తిచేశామంటూ 50 రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. వారు అనేక కారణాలు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మున్సిపాలిటీల్లోని ఇందిరమ్మ ఇళ్ల డేటా ఆన్లైన్లో కన్పించడం లేదంటూ ఏఈలు చెబుతున్నారు.
తన పైఅధికారిని కనుక్కుందామంటే డీఈ సుబ్రహ్మణ్యం జూలై 31న రిటైర్మెంట్ అయ్యారు. దీంతో ఈ సమస్యను ఏఈలంతా కలిసి హౌసింగ్ పీడీ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడా ఆ సమస్యకు పరిష్కారం లభించలేదు. దీంతో లబ్ధిదారులంతా కలిసి తమ సమస్యను కలెక్టర్ దృష్టికి, రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ కూడా ఫలితం లేకపోవడంతో లబ్ధిదారులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.
50 రోజులైనా బిల్లులు రాకపోవడం, తదుపరి నిర్మాణాలు ముందుకు సాగే అవకాశం లేకపోవడం వంటి కారణాలు.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మరికొన్ని తిప్పలు తెచ్చిపెడుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం తెచ్చిన సిమెంట్ బస్తాలు.. ఇటీవలి వర్షాలకు, తేమకు గడ్డ కడుతున్నాయి. ఆరు బయట ఉంచిన ఐరన్ కూడా వర్షాలకు తడిచి తుప్పు పడుతోంది. దీంతో తుప్పు పట్టిన ఇనుము పటిష్టతను కోల్పోవడం, గడ్డ కట్టిన సిమెంట్ పనికి రాకపోవడం వంటి కారణాలతో పేదలైన లబ్ధిదారులు ఆర్థికంగా కూడా నష్టపోవాల్సి వస్తోంది. ఇప్పటికే అప్పులు తెచ్చుకొని బేస్మెంట్లు నిర్మించుకున్న నిరుపేదలకు.. బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం చేస్తున్న ఆలస్యం మరిన్ని ఇబ్బందులను, మరింత నష్టాన్ని తెచ్చిపెడుతుండడం గమనార్హం.
నాకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం ప్రారంభించి బేస్మెంట్ లెవెల్ పూర్తిచేశాను. ఆ వెంటనే మొదటి విడత బిల్లు జమ చేస్తే తదుపరి నిర్మాణ పనులు ప్రారంభించేదాన్ని. కానీ 45 రోజులవుతున్నా ఇంత వరకూ నాకు మొదటి విడత రూ.లక్ష బిల్లు మంజూరు కాలేదు. రోజూ ఎదురుచూస్తున్నాను. మా వద్ద ఉన్న డబ్బులతో బేస్మెంట్ నిర్మించాము. ప్రభుత్వం ఈ బిల్లు ఇస్తేనే కదా ఆపైన పనులు మొదలు పెట్టేది? ఏదీ లేకపోవడంతో తెచ్చిన సిమెంట్‌ను, ఐరన్‌ను కాపాడుకోలేకపోతున్నాము.
-మొలుగు పద్మ, 20వ వార్డు, ఇల్లెందు మున్సిపాలిటీ
నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. దీంతో అప్పటికే ఉన్న పాత ఇంటిని కూల్చుకొని ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాను. బేస్మెంట్ నిర్మాణాన్ని కూడా త్వరగానే పూర్తి చేశాము. ఇది జరిగినప్పటికి 50 రోజులవుతోంది. కానీ ఇంత వరకూ మొదటి విడత రూ.లక్ష బిల్లు రాలేదు. హౌసింగ్ అధికారులు వచ్చి బేస్మెంట్ నిర్మాణాన్ని చూస్తున్నారు. కానీ డేటా రాలేదని వెళ్తున్నారు. మరోసారి పెద్ద సార్లు వస్తారని చెబుతున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
-బానోతు సరోజిని, 20వ వార్డు, ఇల్లెందు మున్సిపాలిటీ