“రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్లలో ఇంటర్ పాసైనోళ్లు, డిగ్రీ ఫెయిలైనోళ్లే పాఠాలు చెప్తున్నారు” అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం చేసిన వ్యాఖ్యలపై ఖమ్మం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ ఉపాధ్యాయులు భగ్గుమన్నారు. సీఎం హోదాలో ఉండి ఇటువంటి మాటలు మాట్లాడడం సరైందికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. తామెంతో కష్టపడి ఉన్నత చదువులు చదువుకున్నామని, ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోవడంతో కుటుంబ పోషణ కోసం ప్రైవేటు పాఠశాలల్లో టీచర్లుగా పని చేస్తున్నామని తెలిపారు. అరకొర వేతనాలతో కాలం వెళ్లదీస్తున్న తమను కించపరిచే విధంగా మాట్లాడడం సీఎంకు తగదన్నారు.
ప్రైవేటు పాఠశాలల్లో కూడా క్వాలిఫైడ్ ఉపాధ్యాయులనే తీసుకుంటారని, ఇంత చిన్న విషయం ముఖ్యమంత్రికి తెలియదా.. అని ప్రశ్నించారు. అసలు ప్రభుత్వ టీచర్ల పిల్లలు చదివేదే ప్రైవేట్ విద్యాసంస్థల్లో అనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రైవేటు టీచర్లు అంటే ఆయనకు అలుసుగా మారిందని, సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడే విధానం ఇది కాదన్నారు. తమను తక్కువ చేసి మాట్లాడే ముందు పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని హితువు పలికారు. – ఖమ్మం, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ప్రభుత్వం నుంచి వేలు, లక్షల్లో జీతాలు తీసుకునే ప్రభుత్వ ఉపాధ్యాయులు వారి పిల్లలను లక్షలు లక్షలు ఫీజులు చెల్లిస్తూ ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివించడాన్ని ఏ రకంగా చూడాలి. సీఎం రేవంత్‌రెడ్డికి ప్రభుత్వ టీచర్లంటే అభిమానం ఉంటే టీచర్ల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించేలా చట్టం తీసుకురావాలి. అప్పుడే ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ ఏటికేడు పెరగడంతోపాటు ప్రభుత్వ విద్యావ్యవస్థ బలోపేతమవుతుంది. అంతేకానీ ప్రైవేటు టీచర్ల పట్ల చులకనభావంగా సీఎం స్థాయిలో మాట్లాడడం చాలా బాధాకరం. ప్రతి ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు బాల్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాడే. ప్రైవేటు టీచర్ల వ్యవస్థలో సైతం మేధావులు ఉన్నారని గ్రహించాలి.
– నారపోగు నాగయ్య(ఎంఎస్సీ, బీఈడీ), ప్రైవేటు టీచర్, ఖమ్మం
ప్రైవేటు ఉపాధ్యాయులను కించపరిచే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడం బాధాకరం. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం జాబ్ నోటిఫికేషన్ ఇవ్వడం చేతకాని సీఎం, ఉన్నత చదువులు చదివి చాలీచాలని జీతాలతో కుటుంబాలను వెళ్లదీసుకుంటున్న ప్రైవేటు టీచర్లను హేళన చేయడం సరికాదు. ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లల్లో అత్యధికులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నది ప్రైవేటు ఉపాధ్యాయులే అన్న విషయం తెలియదా? నిరుద్యోగుల ఓట్లతో సీఎం పీఠం దక్కిందన్న విషయం గుర్తుంచుకోవాలి. సీఎం వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలి.
– ఎలికే అనంతరావు(ఎంఏ, బీఈడీ), ప్రైవేట్ టీచర్, దమ్మపేట
మాది టేకులపల్లి మండలం రాంపురం పంచాయతీలోని పాతతండా గ్రామం. నేను ఎంఏ, బీఈడీ చదువుకున్నా. గతంలో ఐదేళ్లు తడికలపూడి ప్రభుత్వ పాఠశాలలో విద్యా వలంటీర్‌గా పనిచేశాను. ప్రస్తుతం ఐదేళ్లుగా సులానగర్ కార్మల్ మాత ప్రైవేట్ పాఠశాలలో తెలుగు బోధిస్తున్నాను. ప్రైవేట్ పాఠశాలల్లో బోధించేవారు ఇంటర్ పాసైనోళ్లు, డిగ్రీ ఫెయిల్ అయినోళ్లు అని సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడడం బాధాకరం. ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్న మాకు ప్రైవేట్ పాఠశాలలు జీవనాధారంగా ఉన్నాయి. సీఎం పెద్దఎత్తున నోటిపికేషన్ విడుదల చేసి మాకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేలా చూడాలని కోరుతున్నాం.
– భూక్యా రమేష్(ఎంఏ, బీఈడీ), ప్రైవేట్ టీచర్, పాతతండా, టేకులపల్లి