ఖమ్మం రూరల్, మార్చి 23 : స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ 95వ వర్ధంతిని సోమవారం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా నిర్వహించారు. సీపీఐ ఆధ్వర్యంలో 28వ వార్డులోని వరంగల్ క్రాస్ రోడ్డులోని వీధులు కాగడాల జ్వాలలతో అరుణ కాంతులీనాయి. బ్రిటీష్ వారిని ఎదిరించి.. ఉరికంబమెక్కిన భగత్ సింగ్ వర్ధంతిలో సీపీఐ నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ‘ఇంక్విలాబ్ జిందాబాద్’, ‘భగత్ సింగ్ అమర్ రహే’ అంటూ దారి పొడుగునా నినదించారు.
భగత్ సింగ్ వర్ధంతిని పునస్కరించుకొని సీపీఐ 28, 29 వ వార్డులో ర్యాలీ నిర్వహించింది. కాగాడల ప్రదర్శన అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ మాట్లాడుతూ… నూనుగు మీసాల ప్రాయంలోనే దేశం కోసం ప్రాణాలర్పించిన యోధుడు భగత్ సింగ్ అని కొనియాడారు. నాడు దేశభక్తి అంటే ప్రతి ఒక్కరి బాధ్యతగా దేశం కోసం అమరులయ్యారని ఆయన వెల్లడించారు. కానీ నేడు బీజేపీ తన రాజకీయ లబ్ది కోసం దేశభక్తి పేరిట కులం, మతం పేరిట ప్రజలను విడదీస్తోందని దండి సురేష్ ఆరోపించారు. భగత్ సింగ్ ఆశయ సాధన కోసం నేటి యువతరం కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మెడకంటి చిన్న వెంకటరెడ్డి, సీపీఐ జిల్లా సమితి సభ్యుడు వెంపటి సురేందర్, సీపీఐ కౌన్సిలర్లు దండి రంగారావు, మామిండ్ల శ్రీనాథ్ రెడ్డి, సీపీఐ మండల కార్యదర్శి పుచ్చకాయల సుధాకర్, నాయకులు వెన్నం భాస్కర్, వెంపటి రాము, బియ్యాల రాజు, అక్కినపల్లి దేవయ్య, ఏవైఎఫ్ నాయకులు రమేష్, ఉపేందర్, మిరియాల నరుణ్ తేజ్, కిరణ్, యువజన సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.