కొత్తగూడెం క్రైం, అక్టోబర్ 20: ‘ప్రతీ సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. దానిని పట్టుకునేందుకు మార్గం తప్పనిసరిగా లభిస్తుంది’ అని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు పేర్కొన్నారు. ఇటీవల జిల్లా పోలీస్ శాఖలో ఎదురవుతున్న పరిస్థితుల నేపథ్యంలో ‘స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇన్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్’ అంశంపై కొత్తగూడెం సబ్ డివిజన్లోని అధికారులకు, సిబ్బందికి ఆదివారం అవగాహన కల్పించారు.
కొత్తగూడెంలోని పీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ అధికారులు, సిబ్బంది శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలన్నారు.
సమస్య ఎంత పెద్దదైనా సరే.. దానిని పరిష్కరించుకునేందుకు చాలా మార్గాలు ఉంటాయని, వాటిని ఉపయోగించుకుని ముందుకు సాగాలని సూచించారు. విధి నిర్వహణలో భాగంగా ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
చిన్న సమస్యలకే ఒత్తిడిని పెంచుకోవద్దని, అనవసరంగా ఆరోగ్య సమస్యలను తెచ్చుకోవద్దని సూచించారు. పనులను వాయిదా వేయకుండా ఎప్పటిప్పుడు పూర్తి చేసుకుంటే ఒత్తిడి పెరిగే అవకాశం ఉండదని అన్నారు. శారీరకంగా దృఢంగా ఉండేందుకు రోజూ వ్యాయామం చేయాలని కోరారు. వ్యక్తిత్వ వికాస నిపుణుడు జవ్వాది వెంకటేశ్వరరావు, కొత్తగూడెం డీఎస్పీ షేక్ అబ్దుల్ రెహమాన్, చుంచుపల్లి సీఐ రాయల వెంకటేశ్వర్లు, కొత్తగూడెం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ కాగితోజు శివప్రసాద్, వన్ టౌన్ ఎస్సై విజయ, లక్ష్మీదేవిపల్లి ఎస్సై గన్రెడ్డి రమణారెడ్డి, చుంచుపల్లి ఎస్సై రవికుమార్, సుజాతనగర్ ఎస్సై జుబేదా, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.