మణుగూరు టౌన్, జనవరి 4 : నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతాయని భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. మణుగూరు సబ్ డివిజన్ పరిధిలోని మణుగూరు పోలీస్‌స్టేషన్‌లో 92 సీసీ కెమెరాలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేరాల నియంత్రణకు, ప్రమాదాలు జరిగిన సమయంలో వాహనాలను, వ్యక్తులను గుర్తించేందుకు ఇవి ఎంతో ఉపయోగపడుతాయన్నారు.
సబ్ డివిజన్ పరిధిలో 92 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వీటిలో ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజర్(ఏఎంపీఆర్), పీటీ సైట్ కెమెరాలు కూడా ఉన్నాయన్నారు. వ్యాపారులు, ఇంటి యజమానులు తమ ఇంటి ఆవరణ, వ్యాపార సముదాయాల్లో సీసీ టీవీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దొంగలు పడిన తర్వాత కంటే ముందు జాగ్రత్తగా ఏర్పాటు చేసుకుంటే మంచిదన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్‌రెడ్డి, సీఐ సతీశ్‌కుమార్, ఎస్సై మేడా ప్రసాద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.