భద్రాచలం, డిసెంబర్ 28: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి పవిత్ర గోదావరి నదిలో తెప్పోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది.
ముకోటికి తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. తెప్పోత్సవం, ఉత్తర ద్వారదర్శనం అందరికీ కనిపించేలా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో కె.దామోదర్‌రావు తెలిపారు. ముకోటి భక్తుల కోసం ‘ఏరు పండుగ‘ ఈసారి ముకోటిని తరలివచ్చే భక్తుల కోసం ఆధ్యాత్మిక శోభతోపాటు పర్యాటక సంతోషం కలిగేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ‘ఏరు ది రివర్ ఫెస్టివల్’ పేరిట భద్రాచలంలో మూడ్రోజులపాటు గోదావరి తీరాన పర్యాటకులు బస చేసేలా ఏర్పాట్లు సిద్ధంచేశారు.