భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): ఎండ తీవ్రతకు గురికాకుండా ప్రజలు తగు రక్షణ చర్యలు పాటించాలని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక సూచించారు. జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ మేరకు కొత్తగూడెం ఐడీవోసీ నుంచి మంగళవారం నిర్వహించిన అన్ని మండలాల వైద్యాధికారుల వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. ఎండ తీవ్రతకు గురికాకుండా ప్రజలు తగు రక్షణ చర్యలు పాటించాలని సూచించారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందువల్ల ఆస్పత్రిలో అత్యవసర మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం పనులు జరిగే ప్రాంతాల్లో కూలీలు ఎండ దెబ్బతగలకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే పనివేళలు ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. రానున్న రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉన్నందున వేసవిలోపాటించాల్సిన అంశాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కరపత్రాలు సిద్ధం చేయాలన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ప్రజలెవరూ బయటికి రావొద్దని, అత్యవసరమైతే తప్ప బయట ఉండవద్దని, అయినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ వీసీలో వివిధ శాఖల అధికారులు విద్యాచందన, కృష్ణగౌడ్, శిరీష, లక్ష్మణ్‌రావు, వెంకటేశ్వర్లు, చంద్రమౌలి, బాబురావు తదితరులు పాల్గొన్నారు.