పాల్వంచ రూరల్, ఆక్టోబర్ 26: గ్రామీణ యువత తమ స్వశక్తితో ఎదిగి ఆర్థికంగా నిలదోక్కుకోవాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆకాంక్షించారు. ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మతో కలిసి పాల్వంచ మండలం బండ్రిగొండ సమీపంలోని కోయగట్టు గ్రామాన్ని ఆదివారం సందర్శించిన ఆయన.. మట్టితో ఇటుకల తయారు చేసే విధానాన్ని గ్రామ యువతకు చేసి చూపించారు. అనంతరం యువతతో ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతీయువకులు ఉపాధి అవకాశాలు లేవని చింతించకుండా ఉపాధి హామీ ద్వారా సరైన పథకాలను ఎంచుకొని వాటి ద్వారా ఆర్థిక విజయం సాధించాలని సూచించారు.
ఉపాధి హామీ పథకం ద్వారా ప్రత్యామ్నాయ జీవనాధాలరాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఆ క్రమంలో చేపల పెంపకం, కౌజు పిట్టల పెంపకం, వెదురు సాగు, కూరగాయలు, ఆకుకూరల సాగు వంటి అనేక ఉపాధి మార్గాలను ఎంచుకొని స్థిరమైన ఆదాయం పొందొచ్చునని సూచించారు. యువత ఇంకా తమ ఆలోచనలతో నూతన మార్గాలు అన్వేషించాలని సూచించారు.
గ్రామాల్లో తల్లిదండ్రులు వారి పిల్లల విద్యకు పూర్తి సహకారం అందించాలన్నారు. చదువుకున్న యువతీయువకులు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలకు ఉపయోగించుకొని స్వయం ఉపాధిని సాధించుకోవాలని సూచించారు. అటువంటి వారికి తాను పూర్తి సహకారం అందిస్తాననన్నారు. గ్రామాల అభివృద్ధికి యువత కూడా సహకరించాలని కోరారు. ఎంపీడీవో విజయభాస్కర్‌రెడ్డి, ఇతర అధికారులు చెన్నకేశవులు, పోరండ్ల రంగా, ప్రసాద్, తిరుపతయ్య, నారాయణ, ప్రవీణ్‌కుమార్, శంకర్, రాములు తదితరులు పాల్గొన్నారు.