భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 1 (నమస్తే తెలంగాణ) : జిల్లావ్యాప్తంగా భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి దాఖలైన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ పంచాయతీ, నీటిపారుదల, రెవెన్యూశాఖల అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొబైల్ యాప్ ద్వారా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ నిర్వహించాలని, నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయాలని ఆదేశించారు.
నీటిపారుదలశాఖ అధికారులు, ఆయాశాఖల సిబ్బందికి దరఖాస్తుల స్క్రూట్నీ కోసం ప్రతిరోజు లక్ష్యాలను నిర్దేశించాలన్నారు. నీటిపారుదలశాఖ పరిధిలో తనిఖీల సమయంలో ఎట్టి పరిస్థితుల్లో నీటి వనరులు బఫర్ జోన్, ఎఫ్‌టీఏలో ఉండవద్దన్నారు. లేఅవుట్ క్రమబద్దీకరణ సమయంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. టీపీవోలు, పంచాయతీ సెక్రటరీలు ముందుగా లొకేషన్‌ను గుర్తించాలన్నారు. ఈ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌కు సూచించారు. జిల్లాలోని వివిధగ్రామాల్లో తక్కువ సంఖ్యలో ఉన్న దరఖాస్తులను రెండ్రోజుల్లో పూర్తిచేయాలని ఆర్డీవోలు మధు, దామోదర్‌రావును ఆదేశించారు.