లక్ష్మీదేవిపల్లి, సెప్టెంబర్ 11 : సహజసిద్ధంగా వెలసిన అడవులు కేవలం వనరులు కావని, అవి భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు అని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో అటవీ అమరువీరుల దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. తొలుత జిల్లా అటవీ అధికారి కిష్టాగౌడ్ నేతృత్వంలో కొత్తగూడెం ప్రకాశం స్టేడియం నుంచి ప్రారంభమైన ర్యాలీ అర్బన్ పార్కు వరకు కొనసాగింది.
ర్యాలీలో జిల్లావ్యాప్తంగా వివిధ రేంజ్‌ల నుంచి వచ్చిన దాదాపు 500 మంది అటవీ శాఖ సిబ్బంది ప్లకార్డులు, బ్యానర్లతో పాల్గొని.. అటవీ సంరక్షణ, వన్యప్రాణి రక్షణ ప్రాముఖ్యతపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పచ్చని అడవులను రక్షించడం కోసం కొందరు ఉద్యోగులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, వారిని ఈ రోజు స్మరించుకోవడం మన బాధ్యత అని అన్నారు. అంతరించిపోతున్న అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు.
మొక్కలను నాటడమే కాదు.. వాటి సంరక్షిస్తే అవి మహా వృక్షాలు అవుతాయన్నారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ, అటవీ శాఖ అధికారులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎస్పీ రోహిత్‌రాజు, జిల్లా ఫారెస్టు డివిజనల్ ఆఫీసర్లు కొత్తగూడెం నుంచి కోటేశ్వరరావు, ఇల్లెందు అధికారి కరుణాకరాచారి, వైల్డ్‌లైఫ్ మేనేజ్మెంట్ కిన్నెరసాని నుంచి బాబు, పాల్వంచ డీఎఫ్‌వో దామోదర్‌రెడ్డి, మణుగూరు డీఎఫ్‌వో మక్సుద్దీన్, భద్రాచలం డీఎఫ్‌వో సుజాత పాల్గొన్నారు.