భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రిని మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి యాంటీ డ్రగ్ కమిటీ సమన్వయ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, చదువుపైనే దృష్టి సారించాలన్నారు.
మాదక ద్రవ్యాల వినియోగం లేకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టాలని, గంజాయి, మత్తు పదార్థాలు దరిచేరకుండా కళాశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి పెట్టాలన్నారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలు, ఆరోగ్య పరిస్థితుల గురించి వైద్యాధికారులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. భావితరాలు మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కాకుండా వారికి సమాజంలో మంచి, చెడు గురించి తెలియజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే అడవులను నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసీ గిరిజనులు అభివృద్ధి చెందేలా ఇప్ప, కరక్కాయ, వెలగ, ఉసిరి, చింత మొక్కలను విస్తృతంగా నాటేలా అటవీ శాఖ అధికారులు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో యాంటీ నార్కోటిక్ బ్యూరో డీఎస్పీ శరత్, అసిస్టెంట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ సీఐ కరంచంద్, ఎక్సైజ్ సీఐ జానయ్య, డ్రగ్ ఇన్స్పెక్టర్ సంపత్, ఆర్టీవో వెంకటరమణ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.