భద్రాచలం, నవంబర్ 12 : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో బుధవారం నుంచి డిజిటల్ సేవలు ప్రారంభించనున్నట్లు ఆలయ ఈవో రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:10 గంటల నుంచి డిజిటల్ సేవలు(అన్నదానం, ప్రొటోకాల్, వస్త్ర సమర్పణ) ద్వారా అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొన్నారు.
స్వామివారి సేవలో పాల్గొనే భక్తులకు వారి ఫొటో ద్వారా అన్నదానం స్వీకరించే నిమిత్తం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు టోకెన్ పొంది అన్నప్రసాదం అందించే విధంగా సేవలు ఉంటాయని తెలిపారు. ప్రొటోకాల్ దర్శనం కావాల్సిన వారు ప్రొటోకాల్ ఆఫీస్లో డిజిటల్ సేవ ద్వారా వివరాలు నమోదు చేయించుకుని దేవస్థానం వారు ఇచ్చే టోకెన్ ద్వారా స్వామివారిని దర్శించుకునే వీలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
అలాగే భక్తులు సమర్పించే వివిధ వస్ర్తాలను బార్ కోడ్ ద్వారా డిజిటలైజేషన్ చేస్తారని తెలిపారు. ఎడ్లపల్లికి చెందిన ఆత్రేయ ఇన్ఫోటెక్ సిస్టమ్స్ ద్వారా డిజిటల్ సేవలు అందుబాటులోకి వస్తాయని, ఈ సేవలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఈవో కోరారు.