పాల్వంచ, ఆగస్టు 25: జిల్లాలోని వివిధ క్రీడల్లో పాల్గొంటున్న యువ క్రీడాకారుల్లో నైపుణ్యాలు వెలికి తీయాలని ఐటీడీఏ పీవో రాహుల్ సూచించారు. వారిలోని ప్రతిభ పాటవాలను గుర్తించి వారికి నచ్చిన క్రీడల్లో ప్రోత్సాహించాలని ఆకాంక్షించారు. వారు జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించే విధంగా తోడ్పాటు అందించాలని సూచించారు.
జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో పాల్వంచ మినీ స్టేడియంలో నిర్వహించిన అథ్లెటిక్స్, ఆర్చరీ క్రీడా పోటలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. ఈ నెల 29న ఒలింపిక్ హాకీ క్రీడాకారుడు, మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా ఈ క్రీడలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ క్రీడల్లో పాల్గొనే యువకులు మేజర్ ధ్యాన్‌చంద్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు, యువకులు చదువుతోపాటు వారు కోరుకున్న క్రీడలపైనా ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతిరోజూ సాధన చేస్తూ లక్ష్యాన్ని సాధించాలని సూచించారు.
క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడిపోయినంత మాత్రాన నిరుత్సాహ పడవద్దని, మరోసారి గెలవడానికి ప్రయత్నించాలని పేర్కొన్నారు. ఆర్చరీ, అథ్లెటిక్స్ విభాగాల్లో విద్యార్థులు మొదటి స్థానంలో గెలుపొందడానికి శిక్షకులు వారిలో స్ఫూర్తి నింపాలని సూచించారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, హామీ కోచ్‌లు కల్యాణ్, నాగేందర్, ఇమాం, టెన్నిస్, హాకీ అసోసియేషన్ల సెక్రటరీలు యుగంధర్‌రెడ్డి, ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.