భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ భద్రాచలం/ బూర్గంపహాడ్/ పర్ణశాల/ చర్ల/ పాల్వంచ రూరల్, జూలై 28: భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఉదయం 6 గంటలకు 53 అడుగులుగా ఉన్న వరద ప్రవాహం.. మధ్యాహ్నం 2 రెండు గంటలకు మూడు అడుగులు తగ్గి 50 అడుగులకు చేరుకుంది. రాత్రికి మరో రెండు అడుగులు తగ్గి 47.90 అడుగుల వద్ద కొనసాగుతోంది. సోమవారం ఉదయానికి మరికొంత తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే, 48 అడుగుల దిగువకు రావడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ఎగువన చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కొన్ని గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. మరికొన్ని రహదారులపై ఉన్న వరద నీరు ఇంకా తగ్గలేదు.
ఎనిమిది రోజులుగా గోదావరి వరద పెరుగుతూ, తగ్గుతూ దోబూచులాడుతోంది. ఒకవేళ వరద మళ్లీ పెరుగుతుందేమోననే భయంతో ముంపు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే నీట మునిగిన ప్రాంతాల్లో వరద వెనక్కి వెళ్లిన్పటికీ ఆ ప్రాంతాల్లో బురద అలాగే ఉంది. దీంతో అక్కడి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. శనివారం వరద పెరిగినందున ఆ రోజు సాయంత్రమే దాదాపు 39 కుటుంబాల వారిని అధికారులు భద్రాచలంలోని నన్నపునేని హైస్కూల్లో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రంలో ఉంచి సౌకర్యాలు కల్పించారు. కాగా, వరదల కారణంగా భద్రాచలం పుణ్యక్షేత్రానికి పది రోజులుగా భక్తుల సంఖ్య తగ్గింది. అయితే, దిగువన శబరి కూడా ఉప్పొంగడంతో ఏపీలో విలీనమైన కూనవరం మండలంలో ఉన్న వంతెన పైనుంచి ఆ నది ప్రవహిస్తోంది.
ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే, దుమ్ముగూడెం మండలంలోని సున్నంబట్టి, పర్ణశాల, సంగం, గౌరారం, పైడిగూడెం గ్రామాలకు వెళ్లే రహదారులపై వరద నీరు అలాగే ఉండడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గింది. అధికారులు ఆదివారం 25 గేట్లు పూర్తిగా ఎత్తి 26,986 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. వర్షాల వల్ల 2400 క్యూసెక్కుల వరద నీరు కిన్నెరసానిలోకి చేరుతోంది. ప్రాజెక్టు నుంచి 5 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు ఆదివారం రాత్రి విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా.. ప్రస్తుతం 402.8 అడుగులకు చేరింది.
భద్రాచలం వద్ద గోదావరి వరద తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ అది పూర్తిగా తగ్గేంత వరకూ ముంపు బాధితులందరూ పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని, ఆ మేరకు అధికారులకు చర్యలు తీసుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ సూచించారు. భద్రాచలంలో వరద ముంపునకు గురైన కొత్తకాలనీ, విస్తా కాంప్లెక్స్ స్లూయిజ్‌లను ఆదివారం ఆయన పరిశీలించారు. స్లూయిజ్ నుంచి గోదావరిలోకి వరదనీరు పోయే మార్గాన్ని, కొత్తకాలనీ వద్ద ఉన్న బురద నీటిని పరిశీలించారు. ఇరిగేషన్, సీడబ్ల్యూసీ అధికారులు మోటర్ల ద్వారా వరద నీటిని ఎప్పటికప్పుడు గోదావరిలోకి వదలాలని సూచించారు. ఏఎస్పీ అంకిత్‌కుమార్, సీడబ్ల్యూసీ డీఈ మస్తాన్‌రావు, ఏఈ వెంకటేశ్వర్లు, పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.