భద్రాద్రి కొత్తగూడెం, (నమస్తే తెలంగాణ)/ భద్రాచలం, ఏప్రిల్ 10: ఆకాశమంత పందిరి.. భూదేవంత మండపం.. ‘శ్రీరామ.. జయ రామ.. జయ జయ రామ..’ అని భక్తుల హర్ష ధ్వానాలు.. వేద మంత్రోచ్ఛారణలు.. మంగళ వాద్యాల ప్రతిధ్వనుల మధ్య ఆదివారం భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో సరిగ్గా 12 గంటలకు అభిజిత్ ముహూర్తాన శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్వామివారికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.. కొవిడ్ కారణంగా గడిచిన రెండేళ్లలో ఆంతరంగికంగా జరిగిన వేడుకలు ఈసారి బహిరంగ ప్రదేశంలో నిర్వహించడంతో భక్తులు భారీగా తరలివచ్చారు.
శ్రీసీతారాముల కల్యాణం.. జగత్కల్యాణం.. భద్రాచలంలోని మిథిలా స్టేడియం వేదికగా ఆదివారం కనుల పండువగా కల్యాణ మహోత్సవం జరిగింది. తెల్లవారుజామున ఆలయ అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాతసేవ నిర్వహించారు. అనంతరం నివేదన, షాత్తుమురై, మూలవరులకు అభిషేకం నిర్వహించారు. మంగళశాసనాలు పఠించారు. గర్భగుడిలోని మూలమూర్తులకు ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తుల కోలాహలం, మంగళవాద్యాలు, కోలాట నృత్యాల నడుమ ఉత్సవమూర్తులను ఊరేగింపుగా మిథిలా స్టేడియానికి తీసుకువచ్చారు.
స్టేడియంలోని కల్యాణ పీఠంపై ఉత్సవమూర్తులను ఉంచి రామ య్య గుణగణాలు, సీతమ్మ అణకువ, అంద చం దాలను వర్ణించారు. భక్త రామదాసు సీతారాముల కోసం చేయించిన ఆభరణాలు, ఆలయ క్షేత్ర ప్రాశస్త్యం, కల్యాణ మహోత్సవ విశిష్టతను భక్తులకు వివరించారు. సరిగ్గా 12 గంటలకు అభిజిత్ ముహూర్తాన అర్చకులు సీతారాముల శిరస్సులపై జీలకర్ర బెల్లం ఉంచారు. సీతమ్మకు మాంగళ్యధారణ చేశారు. సీతారాములను వధూవరులుగా చూసి భక్తులు తరింంచారు.
పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రులు
సీతారాములకు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పట్టువస్ర్తాలు సమర్పించారు. వేడుకలో రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లు వీపీ గౌతమ్, దురిశెట్టి అనుదీప్, భద్రాచలం ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్, ఎస్పీ సునీల్‌దత్, హైకోర్టు జడ్జీలు అభిషేక్‌రెడ్డి, సుధీర్‌కుమార్, విజయలక్ష్మి, భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య, ఎమ్మెల్సీ మధు, ఆలయ ఈవో శివాజీ, సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ, నటుడు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
భక్తుల కోలాహలం..
కొవిడ్ మహమ్మారి రెండేళ్ల పాటు భద్రాద్రి శ్రీరామనవమి ఉత్సవాలను భక్తులకు దూరం చేసింది. గడిచిన రెండేళ్లలో ఆంతరంగికంగానే ఆలయ అధికారులు సీతారాముల కల్యాణ మహోత్సవం, మహా పట్టాభిషేక వేడుకలు నిర్వహించారు. ఈ ఏడాది కొవిడ్ ప్రభావం లేకపోవడంతో ఆలయ అధికారులు, అర్చకులు అంగ రంగ వైభవంగా కల్యాణం జరిపించారు. వేడుకలకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. భద్రాద్రి ఎస్పీ సునీల్‌దత్ ఆధ్వర్యంలో 6 వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. వైద్యారోగ్యశాఖ అధికారులు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సేవా సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు భక్తులకు తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు.
లగ్నంలో కల్యాణతంతు సాగిందిలా..
తొలుత భద్రాద్రి రామునికి దేవాలయంలో ద్రువమూర్తుల కల్యాణం చేశారు. తరువాత మంగళవాయిద్యాలు మార్మోగుతుండగా.. భక్తుల జయజయ ధ్వానాల మధ్య పల్లకీలో కల్యాణ మండపానికి స్వామివారు తరలివచ్చారు. ముందుగా తిరుకల్యాణానికి సంకల్పం చేసి సర్వ విజ్ఞాన శాంతి కోసం విశ్వక్సేన పూజ నిర్వహించారు. విష్ణు సంబంధమైన అన్ని పూజా శుభ కార్యక్రమాలకు విశ్వక్సేణుడి పూజ చేయడం ఆనవాయితీ. ఈ తంతు జరిగాక పుణ్యహవచనం చేశారు. మంత్ర పూజల్లో కల్యాణానికి వినియోగించే సకల సామాగ్రికి ప్రోక్షణ చేశారు. మంగళవాయిద్యాలు మార్మోగుతుండగా.. వేదమంత్రాల మధ్య అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచారు. ఇది శుభలగ్నం.
ఆ తరువాత జరిగే మాంగళ్య పూజలో మంగళసూత్రంతో ముగ్గురు అమ్మవార్లను ఆవాహనం చేశారు. జనకమహారాజు, దశరథమహారాజు తరఫున చేయించిన రెండు మంగళసూత్రాలతోపాటు భక్తరామదాసు సీతమ్మకు చేయించిన మరొక మంగళసూత్రం కలిపి మూడు సూత్రాలతో మాంగళ్యధారణ గావించారు. స్వామివారికి పచ్చల పతకం, సీతమ్మకు చింతాకు పతకం, లక్ష్మణస్వామికి రామమాడలు అలంకరించి మదుపర్కం సమర్పించారు. మంగళధారణ సమయంలో శ్రీరామ జయరామ జయజయ రామ అంటూ భక్తులు ఉచ్ఛస్తుంటే మిథిలా ప్రాంగణమంతా రామనామమయమైంది. అనంతరం శ్రీ సీతారామచంద్రస్వామివారిని ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకొని వెళ్లారు. ఆలయ అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమవాది విజయరాఘవన్ అయ్యవార్లు కల్యాణ క్రతువును నిర్వహించారు.
భక్తులతో పోటెత్తిన పర్ణశాల దివ్యక్షేత్రం
పర్ణశాల, ఏప్రిల్ 10: పవిత్ర పుణ్యక్షేత్రమైన పర్ణశాల శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం కన్నులపండువగా జరిగింది. ఉదయం 5 గంటలకు స్వామివారికి తిరుమంజనం గావించి సువర్ణ పుష్పార్చన చేశారు. ఉదయం 10:30 గంటలకు శ్రీసీతారామచంద్ర స్వామివారిని పట్టువస్ర్తాలతో అలంకరించారు. ఆలయ సూపరింటెండెంట్ కిశోర్ దంపతులు పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు అందించారు. శ్రీశుభ కృత్ నామ సంవత్సరాన చైత్రశుద్ధ నవమి మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. కల్యాణ క్రతువును వేదపండితులు భార్గవాచార్యులు, కిరణ్‌కుమారాచార్యులు, వెంకటాచార్యులు, రవికుమారాచార్యులు, రఘుపుంగవాచార్యులు, నందకృష్ణాచార్యులు నిర్వహించారు. తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీవో చంద్రమౌళి, ఎంపీవో ముత్యాలరావు, సీఐ రమేశ్, ఏఈ రోహిణి, జడ్పీటీసీ, ఎంపీపీలు తెల్లం సీతమ్మ, రేసు లక్ష్మి, వైద్యులు బాలాజీనాయక్, మణిదీప్, సర్పంచ్ వరలక్ష్మి, ఇరిగేషన్ ఏఈ రాజ్సుహాస్, ఎస్సై రవికుమార్, ఆలయ ఏఈవో భవానీ రామకృష్ణ, సూపరింటెండెంట్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు.