ఖమ్మం సిటీ/ ఖమ్మం, నవంబర్ 1 : ఖమ్మం నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో పలురకాల సేవలను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఇన్చార్జి డీఎంహెచ్వో డాక్టర్ చందునాయక్ పర్యవేక్షణలో ఖమ్మంలోని వెంకటేశ్వరనగర్ యూపీహెచ్సీ యంత్రాంగం బొక్కలగడ్డ, 47వ డివిజన్ శివాలయం రోడ్డు, ఎల్లమ్మతల్లి కట్ట, మజీద్ గల్లీలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు.
శ్రీనివాసనగర్ యంత్రాంగం సారథ్యంలో 35వ డివిజన్లోని మోతీనగర్, శ్మశానవాటిక, అర్బన్ మలేరియా టీం ఆధ్వర్యంలో 16వ డివిజన్ ధంసలాపురంకాలనీ, 47వ డివిజన్ బొక్కలగడ్డలోని మంచికంటినగర్, పద్మావతినగర్, బీరప్పగుడి సెంటర్, ముస్లింకాలనీ, హనుమాన్కాలనీ, ఎన్జీవోస్ కాలనీల్లో విస్తృతంగా పర్యటించారు. వైద్యాధికారులు, హెల్త్ సూపర్వైజర్స్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఇంటింటి ఫీవర్ సర్వే చేశారు. జ్వర పీడితులను గుర్తించి మందులు అందించి జాగ్రత్తల గురించి వివరించారు.
అవసరమైన వారికి ఓఆర్ఎస్ ద్రావణం ప్యాకెట్లు అందజేస్తూ, సైడు కాల్వలు, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమలు వృద్ధి చెందకుండా కీమో పాస్ వంటి ద్రావణాలను పిచికారీ చేశారు. ఈ సందర్భంగా పలువురు వైద్యాధికారులు మాట్లాడుతూ తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలని, ప్రతిసారి వేడి చేసి చల్లార్చిన నీటినే తాగాలని సూచించారు. వేడివేడిగా ఆహార పదార్థాలను భుజించాలని, ఈగలు, దోమలు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలని, తలనొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, జ్వరం, ఒంటి నొప్పులు ఉన్నట్లయితే తక్షణమే సమీపంలోని దవాఖానకు వెళ్లి వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ ఎన్.నాగమణి, సూపర్వైజర్స్ సీహెచ్ రజిని, జయపాల్, గోపాలకృష్ణ, భారతీదేవి, వెంకటేశ్వర్లు, మెడికల్ ఆఫీసర్ రాంమోహన్ నాయక్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.