‘బతుకునిచ్చే బతుకమ్మ..’ అంటూ నాటి కేసీఆర్ సర్కారులో ఎంతో గౌరవాన్ని పొందిన స్వరాష్ట్ర సాంస్కృతిక పండుగకు నేటి కాంగ్రెస్ సర్కారులో అడుగడుగునా అవమానం ఎదురవుతోంది. ప్రకృతి పూజిత పూల పండుగపై ప్రభుత్వ పట్టింపులేని తనం ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. అసలు ఉద్యమంలో రాష్ట్ర ప్రజల్లో ఉత్తేజాన్ని నింపిన బతుకమ్మ అంటే ప్రభుత్వానికి భారంగానే కన్పిస్తున్నట్లుగా ఉంది. నాడు అన్ని వీధుల్లోనూ అంగరంగవైభవంగా ఆటలాడిన ఆడబిడ్డలకు.. నేడు ఎక్కడ చూసినా ఆటంకాలే ఎదురవుతున్నాయి.
ఇందులో అధికార పార్టీ నేతలు సృష్టించే ఇబ్బందులు కొన్నైతే.. అసలు ప్రభుత్వమే కల్పించే ఆటంకాలు మరికొన్నిగా ఉన్నాయి. అస్తిత్వ ప్రతీకగా ఉన్న మన పూల పండుగకు ఖండాంతరాల్లోనూ అద్వితీయ ఆదరణ లభిస్తున్న వేళ.. స్వరాష్ట్రంలోనే నేడు దానికి అలక్ష్యం ఎదురవుతుండడం సర్కారు కక్షపూరిత ధోరణికి అద్దం పడుతోంది. సింగిడిలోని పూలన్నింటినీ తెచ్చుకొని సాయంత్రాన సంబురంగా ఆడుకుందామన్న అక్కాచెళ్లెళ్ల ఆశలపై రేవంత్ సర్కారు ఎంచక్కా నీళ్లు చల్లింది. అసలు పండుగనే పట్టించుకోకపోగా.. ఘాట్ల వద్ద కనీసం పరిశుభ్రమూ చేయలేదు. పండుగ నిర్వహణ కోసం పైసా విదిల్చిన పాపానపోలేదు. చివరికి పట్టించుకున్నదీ లేదు.
భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ అశ్వారావుపేట టౌన్/ ఇల్లెందు రూరల్/ టేకులపల్లి/ సారపాక, అక్టోబర్ 5: తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా ఉన్న బతుకమ్మ పండుగను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కనీసం అధికారిక వేడుకలూ నిర్వహించడం లేదు. నాటి కేసీఆర్ సర్కారులో సాంస్కృతిక వైభవం వెలుగొందిన తీరును.. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోని తీరును గమనించిన ఆడబిడ్డలందరూ ఆవేదన భరితమవుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోకున్నా, పరిశుభ్రమైన ఘాట్లు సమకూర్చకున్నా బతుకమ్మ మీద మమకారంతో సొంతంగానే సౌకర్యాలను సమకూర్చుకుంటున్నారు.
కొన్నిచోట్ల అసౌకర్యాల మధ్యనే ఆడుకుంటున్నారు. ఆఖరికి బతుకమ్మను నిమజ్జనం చేసేందుకు వాగుల వద్దకు వెళ్లే మార్గాల్లో కూడా వెలుగులు ఏర్పాటుచేయలేదు. దీంతో చిమ్మ చీకట్లలోనే ఆడబిడ్డలందరూ బతుకమ్మలను ఎత్తుకొని వెళ్తున్నారు. అలాగే, చెరువుల్లో తూటికాడ పెరిగి ఉన్న చోట్ల కూడా వాటిని తొలగించలేదు. దీంతో బతుకమ్మలను అక్కడ నిమజ్జనం చేసేందుకు అక్కాచెళ్లెల్లు అష్టకష్టాలు పడుతున్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వంలో బతుకమ్మ పండుగకు నెల రోజుల ముందుగానే బతుకమ్మ చీరల పంపిణీ జరిగేది. ఆడబిడ్డలందరూ వాటిని ఎంతో ఆప్యాయంగా అందుకునే వారు. వాటినే ధరించి పండుగ రోజుల్లో బతుకమ్మ ఆడేవారు. కానీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన ఈ సమయంలో బతుకమ్మ చీరల జాడ లేదు. చివరికి బతుకమ్మ పండుగ ఊసే లేదు. గతంలో ప్రభుత్వ శాఖలు కూడా రోజుకు ఒక్కోటి చొప్పున తొమ్మిది రోజులపాటూ అంగరంగ వైభవంగా పండుగలు జరిపేవి. మహిళా అధికారులు, ఉద్యోగినులకు అప్పటి ప్రభుత్వం మధ్యాహ్నం నుంచి సెలవు సౌకర్యాన్ని కల్పించేది. దీంతో వారంతా వెళ్లి సాయంత్రం సంబురంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే వారు. కానీ నేడు ఎక్కడా అలాంటి పరిస్థితి కన్పించడం లేదు.
తెలంగాణ వచ్చాక నాటి కేసీఆర్ ప్రభుత్వం అధికారికంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించింది. జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు తమ పరిధిలో వేడుకలు నిర్వహించేవారు. కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అలాంటి పరిస్ఙితి లేకుండాపోయింది. నిరుటి బతుకమ్మ వేడుకలు సాక్షాత్తూ భద్రాద్రి కలెక్టరేట్లో నిరుడు వైభవంగా జరుగగా.. నేడు ఆ ఉత్సవాల ఊసే లేకుండా పోవడం గమనార్హం.
అశ్వారావుపేట మండలంలో బతుకమ్మ వేడుకలకు ప్రభుత్వం నుంచి ఆదరణ కన్పించడం లేదు. మండలంలోని పలు చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించలేదు. కొన్ని చెరువుల్లో నీళ్లు లేవు. బతుకమ్మ ఘాట్ ఉన్న దొంతికుంట చెరువులో నీళ్లు ఉన్నప్పటికీ అక్కడ దుర్గంధం వెదజల్లుతోంది. చెరువంతా తూటికాడ, గుర్రపు డెక్క ఏపుగా పెరిగి ఉండడంతో అక్కడ బతుకమ్మ నిమజ్జనానికి ఆటంకం కలుగుతోంది. ఇక్కడి ఘాట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కనీస చర్యలు కూడా తీసుకోలేదు.
బూర్గంపహాడ్ మండలంలోనూ సరైన సౌకర్యాలు లేక ఆడబిడ్డలు ఇబ్బందులు పడుతూనే బతుకమ్మ ఆడుతున్నారు. బతుకమ్మ కోసం ఏటా విద్యుత్ దీపాలతో వెలుగులీనే ఘాట్లు ఈసారి చీకటిమయంగా కన్పిస్తున్నాయి. మండలంలో ముఖ్యమైన నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పల్లెప్రకృతి, బతుకమ్మ ఘాట్లలో అపరిశుభ్రత తాండవించింది. ఆడబిడ్డలు వచ్చి అక్కడ బతుకమ్మను నిమజ్జనం చేయాల్సి ఉన్నా ప్రభుత్వం అక్కడ సరైన సౌకర్యాలు కల్పించలేదు.
ఇల్లెందు మండలంలో ఇంకో ఆటంకాన్ని ప్రభుత్వం కల్పించినట్లుగా కన్పిస్తోంది. రాత్రి వేళ ఇక్కడి ఆడబిడ్డలు వీధుల్లోకి చేరుకొని వీధి లైట్ల బతుకమ్మ ఆడుకుంటుంటారు. కానీ మండలంలోని పోలారం గ్రామంలో ప్రభుత్వం వీధి లైట్లను ఏర్పాటు చేయలేదు. దీంతో ఇక్కడి మహిళలు చీకట్లోనే బతుకమ్మ ఆడుకోవాల్సి దుస్థితి నెలకొంది. కొన్ని నెలలుగా ఇక్కడ వీధి లైట్లు లేకున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. చివరికి బతుకమ్మ వేడుకల వేళ కూడా స్పందించలేదు. వీధి లైట్లు ఏర్పాటు చేయలేదు.
తెలంగాణలో సంస్కృతికి ప్రతీక.. బతుకమ్మ పండుగ. ఇంతటి ముఖ్యమైన పండుగను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటే తెలంగాణ ఆడబిడ్డలను అవమానించడమే. వాళ్లకు ఈసారి ఇంకా బతుకమ్మ చీరలు ఇవ్వలేదు. నిన్నటి వరకు చీరలు రానేలేదు. గత ప్రభుత్వంలో మిగిలిన చీరలను ఇప్పుడు ఇవ్వాలని చూస్తున్నారు. బతుకమ్మ అంటేనే ఆడబిడ్డల పండుగ. కానీ ఈ ప్రభుత్వంలో ఈ పండుగకు ఆదరణ లేకుండా పోతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా వేడుకలు జరపడం లేదు.
-కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్, కొత్తగూడెం
గత కేసీఆర్ ప్రభుత్వంలో బతుకమ్మ పండుగ వేళ ఆడబిడ్డలందరూ ఎంతో సంబురంగా ఉండేవాళ్లు. ఆనందంగా బతుకమ్మ ఆడేవారు. అప్పుడే వచ్చిన బతుకమ్మ చీరలను ధరించి మురిసిపోయేవాళ్లు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో ఆడబిడ్డలు అంత ఆనందంగా లేదు. ఈ సారి బతుకమ్మ చీరలు కూడా ఇంకా ఇవ్వలేదు. బతుకమ్మ ఆడేందుకు అక్కాచెళ్లెళ్లు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. కానీ ఈ సర్కారు మాత్రం సరైన సౌకర్యాలు కల్పించడం లేదు.
-ఆమెడ రేణుక, టేకులపల్లి