సత్తుపల్లి, ఆగస్టు 30 : ధూపదీప నైవేద్య పథకం కింద అర్చకులకు ఇచ్చే గౌరవ భృతి రూ.6వేలను రూ.10వేలకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై ఆనందపడుతున్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పురాతన ఆలయాలకు పూర్వవైభవం తీసుకొస్తూ.. తమకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న సీఎం కేసీఆర్‌ను ఎన్నటికీ మరువమంటున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆలయాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. పట్టించుకునేవారు లేక.. అభివృద్ధికి నిధులు మంజూరు చేయకపోవడంతో ఆదరణ కోల్పోయాయి. ధూపదీప నైవేద్యాల కోసం ఆనాటి ప్రభుత్వాలు ఇచ్చే నిధులు ఎటూ సరిపోక దాతలు, గ్రామ పెద్దల సహకారంతో నెట్టుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అన్ని రంగాలకు పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్ ఆధ్యాత్మికతతోనే ధర్మం విలసిల్లుతున్నదని నమ్మి.. ఆ దిశగా సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పురాతన ఆలయాలకు పూర్వవైభవం తీసుకొస్తూ.. ధూపదీప నైవేద్యం పథకం కింద అర్చకులకు ఇచ్చే గౌరవ భృతిని రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంచుతామని.. వారికి అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని మే 31న గోపన్‌పల్లిలో బ్రాహ్మణ సంక్షేమ భవన్ ప్రారంభోత్సవంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈ మేరకు అర్చకుల జీతాలు పెంచాలని సర్కారు నిర్ణయించగా.. దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ మంగళవారం జీవో విడుదల చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 550 దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ఈ పథకం కింద లబ్ధి చేకూరనున్నది. ప్రభుత్వ నిర్ణయంతో అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆలయాలకు పూర్వ వైభవం..
సమైక్య రాష్ట్రంలో ఆదరణ కోల్పోయిన ఎన్నో ప్రముఖ ఆలయాలు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో పూర్వ వైభవం సంతరించుకున్నాయి. ప్రముఖ ఆలయాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం విడతలవారీగా నిధులు కేటాయిస్తూ తీర్చిదిద్దుతున్నది. అంతేకాక.. అర్చకుల కష్టాల గురించి తెలుసుకున్న సీఎం కేసీఆర్ వారికి బాసటగా నిలవడంతోపాటు ధూపదీప నైవేద్య పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో పని చేస్తున్న అర్చకులకు గౌరవ భృతిని తాజాగా రూ.10వేలకు పెంచారు.
వేతనాల పెంపు హర్షణీయం
బ్రాహ్మణ పక్షపాతి అయిన సీఎం కేసీఆర్ అర్చకుల వేతనాన్ని రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంచుతూ జీవో జారీ చేయడం హర్షణీయం. సంస్కృతీ సాంప్రదాయాలను పరిరక్షించేలా బ్రాహ్మణ పరిషత్‌కు రూపకల్పన చేసి శిథిలమైన ఆలయాల పునఃప్రతిష్ఠకు ప్రభుత్వం పూనుకోవడం మరిచిపోలేం. గత ప్రభుత్వాలు బ్రాహ్మణులను ఏమాత్రం పట్టించుకోలేదు. వేతనాలు పెంచిన సీఎం కేసీఆర్‌ను బ్రాహ్మణులు ఎప్పటికీ మరచిపోరు.
– కిశోర్ శర్మ, సరస్వతి దేవాలయం అర్చకుడు, సత్తుపల్లి
సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి
గతంలో అర్చకులకు ధూపదీప నైవేద్య పథకం కింద రూ.2,500 ఉంటే స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ దానిని రూ.6వేలకు పెంచడం మంచి పరిణామం. బ్రాహ్మణుల పరిస్థితి, సమస్యలను గుర్తించి రూ.10వేలకు గౌరవ భృతిని పెంచడం చాలా సంతోషకరమైన విషయం. సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి.
– మేడూరు సీతారామాచార్యులు, కిష్టారం రామాలయ అర్చకుడు, సత్తుపల్లి మండలం
ఆలయాలకు పూర్వవైభవం
సీఎం కేసీఆర్ పాలనలో ఆలయాలకు పూర్వవైభవం వచ్చింది. గత పాలకుల హయాంలో ధూపదీప నైవేద్యాల కోసం అర్చకులు దాతల కోసం ఎదురుచూడాల్సి వచ్చేది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ డీడీఎన్ఎస్ కింద ఆలయానికి రూ.6వేల చొప్పున ఇచ్చారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.10వేల వేతనం ప్రకటించడం హర్షణీయం. అన్నివర్గాల సంక్షేమం కోసం ఇంతగా ఆలోచించే ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదు.
– కొడిమెల అప్పారావు, బ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు, సత్తుపల్లి
అర్చకుల తరఫున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
ధూపదీప నైవేద్య పథకం కింద నెలకు ఇచ్చే రూ.6వేలను రూ.10వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. ఆలయానికి రూ.2వేల నుంచి రూ.4వేలకు, అర్చకులకు గౌరవ వేతనం రూ.2,500 నుంచి రూ.6వేలకు పెంచుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. సీఎం హామీకి అనుగుణంగా దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం మంచి పరిణామం. అర్చకుల దీర్ఘకాలిక సమస్యను ఆచరణలోకి తేవడంతో రాష్ట్రవ్యాప్తంగా అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారందరి తరఫున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్