కులగణన సర్వేలో బీసీల జనాభాను తగ్గించి చూపి మోసానికి పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బహుజనులు భగ్గుమంటున్నారు. అధికారం చేపట్టగానే రాజ్యాంగబద్ధంగా బీసీ రిజర్వేషన్లు తెస్తామని, వాటి ప్రకారం 42శాతం కోటా కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడేమో వంచనకు పాల్పడుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం పెరగాల్సిన జనాభా.. కేవలం బీసీల్లోనే ఎలా తగ్గుతుందని ప్రశ్నించారు. బీసీలకు ద్రోహం చేసి ఓసీలకు మేలు చేసేందుకే వారి జనాభా పెరిగినట్లు చెబుతోందని ధ్వజమెత్తారు. తమకు అన్యాయం చేయాలని చూస్తే కాంగ్రెస్కు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని తీర్మానాలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీలో తీర్మానించి పంపిన బిల్లును కేంద్రప్రభుత్వం ఆమోదించాలంటూ మెలికపెడితే ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై చేస్తున్న మోసాన్ని ఖండిస్తూ అన్ని బీసీవర్గాల ప్రజలు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.
– నమస్తే నెట్వర్క్
బీసీలను తగ్గించి చూపడం సరికాదు
తప్పుడు సర్వేలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే ఎవరూ ఊరుకోరు. 2011లో ఉన్న జనాభాకు ఇప్పటికి తక్కువ చూపించి బీసీలను తగ్గించడం సరికాదు. అందరి కంటే ఎక్కువగా ఉన్న బీసీలను పాత లెక్కల ప్రకారం తక్కువగా చూపించి.. ఓసీలను ఎక్కువ చేసి చూపించడంలో ఆంతర్యమేమిటో అర్థమైంది. బీసీలను 46 శాతానికి కుదించి వారి హక్కులను ప్రభుత్వం కాలరాస్తోంది. భవిష్యత్లో బడుగుల సత్తా ఏమిటో చూపిస్తాం.
-కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్, కొత్తగూడెం
బీసీలను అణచివేసేలా సర్వే
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన కులగణన బీసీలను అణచివేసే విధంగా ఉంది. సర్వేలో బీసీలను తగ్గించి చూపడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. సర్వే ఫలితాలను సమీక్షించి పారదర్శకతతో గణాంకాలను వెల్లడించాలి. కులగణన సర్వేలో జరిగిన తప్పులను సవరించి బీసీలకు న్యాయం జరిగే విధంగా చూడాలి. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టి చిత్తశుద్ధిని చాటుకోవాలి.
-అచ్చన రామకృష్ణ, బీఆర్ఎస్ నాయకుడు, కురుమ సంఘం మండల మాజీ అధ్యక్షుడు, అన్నపురెడ్డిపల్లి
మోసం చేసేందుకు కుట్ర
రాష్ట్రంలోని బీసీలను మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతుంది. సీఎం రేవంత్రెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. లేనిపక్షంలో ఎక్కడికక్కడే ఆందోళనలు చేపడతాం.
-రావుల సోమయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, కరకగూడెం
రిజర్వేషన్ అమలు చేశాకే ఎన్నికలు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు పెట్టాలి. ప్రభుత్వం కులగణన సర్వే సరిగా చేయలేదు. గతంలో ఉన్న బీసీల సంఖ్య కంటే ప్రస్తుతం ఉన్న బీసీల సంఖ్య పెరగాలి కానీ తగ్గింది. మళ్లీ పూర్తిస్థాయి సర్వే చేయాలి. బీసీ సర్వేపై అన్ని కులాల నుంచి వ్యతిరేకత వస్తోంది.
-పోగు వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ నాయకుడు, కరకగూడెం మండలం
కులగణన తప్పుల తడక..
ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణనలో తప్పుల తడక మాదిరిగా ఉంది. బీసీలకు అన్యాయం చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతుంది. ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు పెంచాలి. నామమాత్రపు సర్వేతో బీసీలకు అన్యాయం చేస్తే ఊరుకోం.
-బుడగం రాము, బీసీ నాయకుడు, కరకగూడెం మండలం
పారదర్శకత లోపించింది..
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనలో పారదర్శకత లేదు. నామమాత్రపు సర్వే చేసి కావాలనే బీసీ లెక్కలు తక్కువ చేసి చూపారు. బీసీలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోం. మరోసారి కులగణన చేపట్టి జనాభాను ప్రకటించాలి. బీసీల రిజర్వేషన్ స్థానం పెంచి రాజకీయంగా అవకాశం కల్పించాలి.
-అత్తే సత్యనారాయణ, బీసీ నాయకుడు, అనంతారం, కరకగూడెం మండలం
శాస్త్రీయత లేని కులగణన
రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా చేపట్టిన కుల గణనకు శాస్త్రీయత లేదు. బీసీలకు రాజకీయ రంగంలో రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో ప్రభుత్వం రెండు నాల్కల ధోరణి అవలంబిస్తుంది. ఇంకా 3.1 శాతం జనాభాను సర్వే చేకుండానే బీసీల లెక్కను ఎలా నిర్ధారించారో ప్రభుత్వ పెద్దలు చెప్పాలి. బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే ఉద్యమాలు చేస్తాం. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే.
-బత్తిని మధుగౌడ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు
తప్పుల తడకగా సర్వే నివేదిక
చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని అశాస్త్రీయమైన సర్వేలు చేసి తప్పల తడకలుగా నివేదికలు ప్రకటించి చేతులు దులుపుకున్నారు. కామారెడ్డిలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కొత్తగా సీఎం రేవంత్రెడ్డి పార్టీ పరంగా రిజర్వేషన్లు అంటూ బీసీలతో డ్రామాలు ఆడుతున్నారు. బీసీల జనాభా తక్కువ చేసి చూపించిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల రాజకీయ అవకాశాలను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తుంది. దీనిపై పోరాటాలకు సిద్ధమవుతున్నాం.
-దరిపల్లి వీరబాబు, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు
50 శాతానికి మించి బీసీలు
అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు బీసీల కులగణన విషయంలో చెప్పినవన్నీ అబద్దాలే. బీసీల జనాభా రాష్ట్రంలో 50 శాతానికి మించి ఉంటుంది. అశాస్త్రీయమైన లెక్కలతో బీసీల అవకాశాలను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణాలకు వత్తాసు పలుకుతుంది. సర్వే నివేదికలను సమీక్షించి బీసీలను న్యాయం చేయాలి. బీసీల విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రజా క్షేత్రంలో నిలదీస్తాం.
-పేరం వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఖమ్మం రూరల్ మండలం