రాష్ట్రంలో బీసీల జనాభా 46 శాతమేనంటూ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వంపై బీసీ వర్గాల ప్రజలు, ఆ సంఘాలు నాయకులు భగ్గుమంటున్నారు. గత నవంబర్లో చేపట్టిన ఇంటింటి కుటుంబ సర్వేను పూర్తిస్థాయిలో జరపకుండానే ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను ప్రకటించడంపై మండిపడుతున్నారు. బీసీలను అణగదొక్కడం కోసం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తక్కువ సీట్లు కేటాయించడం కోసమే ఈ అసమగ్ర కులగణన సర్వేను ప్రభుత్వం విడుదల చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీలు 56 శాతంగా ఉన్నట్లు తేలిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా చేసిన ఇంటింటి కులగణన సర్వేలో బీసీలు ఏకంగా 10 శాతం తగ్గి 46 శాతానికే ఎలా పరిమితమవుతారని ప్రశ్నిస్తున్నారు. పైగా అంతకుముందు 6 శాతంగా ఉన్న ఓసీలు ఇప్పుడు 15 శాతం ఎలా పెరుగుతారంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటి సర్వేలో సమగ్రత డొల్లలా ఉందని విమర్శిస్తున్నారు.
సర్వేలో పారదర్శకతకు ప్రభుత్వం పాతరేసిందని దుయ్యబడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సర్వే నివేదిక అంతా తప్పుల తడకగా ఉందని తూర్పారబడుతున్నారు. ఎన్నికల్లో లబ్ధికోసమే హడావిడిగా సర్వే చేసి బీసీలను మోసం చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సోమవారం బీఆర్ఎస్ సహా పలు పార్టీల నేతలు, బీసీ సంఘాల నాయకులు ‘నమస్తే తెలంగాణ’తో తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
-ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 3
బీసీల జనాభా, కులగణనపై ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నివేదికపై అనేక అనుమానాలు ఉన్నాయి. గ్రామ, మండల స్థాయిల్లో కులగణన సమగ్రంగా జరగలేదు. అందుకని ఇక్కడే అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీసీ సంఘాల ప్రమేయం లేకుండా, వారి అభిప్రాయాలు తీసుకోకుండా కులగణన చేయడం సరికాదు. బీసీ సంఘాలను ప్రభుత్వం దూరం పెడుతుండడం కూడా సందేహాలకు తావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధికోసమే బీసీ కులగణన సర్వే చేపట్టింది. బీసీ కులగణన సర్వేపైనా, బీసీలకు న్యాయం చేసే అంశంపైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.
-సత్తి నాగేశ్వరరావు, బీసీ సంఘం నాయకుడు,చండ్రుగొండ
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బీసీ కులగణన సర్వే నివేదిక తప్పుల తడకగా ఉంది. ఎన్నికల కోసమే ఈ తప్పుడు నివేదికను ప్రకటించింది. బీసీలను మోసం చేయాలన్న కుట్ర స్పష్టంగా కన్పిస్తోంది. రాష్ట్రంలో బీసీలు 60 శాతానికి పైగానే ఉన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువగా చూపింది. పైగా ఈ కులగణన పేరుతో ఏడాదిపాటు కాలయాపన చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పటికిప్పుడు హడావిడి చేస్తోంది. అదీగాక బీసీ కులాల మధ్య కొట్లాటలు పెట్టే విధంగా వ్యవహరిస్తోంది. బీసీలను విస్మరస్తే ఉద్యమం చేపడుతాం.
-పగడాల నాగరాజు, బీసీ నాయకుడు, బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు
తప్పుడు సర్వేలతో బీసీలు నష్టపోతారు. అసలు బీసీల జనాభా ఎంత శాతం అనే విషయాన్ని కులగణన ద్వారా వెల్లడించాలి. ఆ నివేదిక సమగ్రంగా ఉండాలి. కానీ తాజాగా ప్రభుత్వం వెల్లడించిన కులగణన సర్వే సమగ్రంగా ఉన్నట్లు కన్పించడం లేదు. కులగణన సర్వే పూర్తిస్థాయిలో జరిగితేనే బీసీలకు న్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో బీసీల జనాభా శాతం అత్యధికంగా ఉంది. ప్రభుత్వం మరోసారి సర్వే నిర్వహించి కచ్చితమైన గణాంకాలు ప్రకటించాలి.
-బొమ్మా రాజేశ్వరరావు, బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు, ఖమ్మం
రాష్ట్రంలో అత్యధిక శాతంగా ఉన్న బీసీలకు అన్యాయం చేసేందుకు కులగణన సర్వే నివేదికను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుగా వెల్లడించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు మొండిచేయి చూపించాలనే ఉద్దేశం ఈ సర్వేలో పక్కాగా కనిపిస్తోంది. సర్వేలో కొన్ని ఇళ్లను మాత్రమే గుర్తించారు. సర్వే కోసం ఇంటింటికి వచ్చిన సిబ్బంది.. అనేక గ్రామాల్లో చాలా ఇళ్లను వదిలేసి వెళ్లారు. ఆయా ఇళ్లను సందర్శించి సర్వేను చేపట్టలేదు. పూర్తిస్థాయిలో చేయని సర్వే సమగ్ర సర్వే ఎలా అవుతుంది? సామాజిక కుల సర్వే చేపట్టి కచ్చితమైన నివేదికను వెల్లడించాలి.
-కూరాకుల నాగభూషణం, బీసీ నాయకుడు, డీసీసీబీ మాజీ చైర్మన్
2011 జనాభా లెక్కల ప్రకారం కులగణన చేసి బీసీల రిజర్వేషన్లు తగ్గించారు. బీసీల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ ముస్లిలను, బీసీలను విభజించి బీసీ కోటాను తగ్గించే ప్రయత్నం చేశారు. తాజా కులగణన సర్వే నివేదికలో ఇదే విషయం స్పష్టమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సీట్లు ఇవ్వకూడదనే దురుద్దేశంతోనే రిజర్వేషన్లను తగ్గించేందుకు ప్రభుత్వం పూనుకుంటోంది. ఇది చాలా దారుణం. ఈ సర్వే కూడా నిజమైన సర్వే కాదు. ఇంటివద్ద కూర్చొని తప్పుడు లెక్కల ద్వారా నివేదిక ఇచ్చారు. మళ్లీ సర్వే చేయాలి.
-అంకినీడు ప్రసాద్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు, భద్రాద్రి జిల్లా
బీసీల కులగణనను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులతడకగా నిర్వహించింది. అనేక ప్రాంతాల్లో అసలు సర్వేను సక్రమంగా చేపట్టలేదు. సర్వేకు వచ్చిన ఎన్యూమరేటర్లు అరకొరగా సమాచారాన్ని సేకరించారు. ప్రభుత్వం ముందస్తుగానే కులం వివరాలు చెప్పకపోయినా ఫర్వాలేదని అన్నది. దీంతో అనేక ప్రాంతాల్లో ప్రజలు కులం వివరాలను వెల్లడించలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం సర్వే పూర్తి చేసినట్లు చెబుతోంది. అందులోని వివరాలన్నీ తప్పులమయంగా ఉన్నాయి. మరోసారి సర్వే నిర్వహించి పూర్తిస్థాయిలో బీసీల వివరాలు సేకరించాలి.
-గుండాల కృష్ణ, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, ఖమ్మం
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కుల గణనలో తప్పుడు లెక్కలు ఉన్నట్లు స్పష్టంగా కన్పిస్తోంది. రాష్ట్రంలో అధిక శాతం ఉన్న బీసీలను తక్కువ సంఖ్యలో చూపించడమే ఇందుకు నిదర్శనం. బీసీలను మభ్యపెట్టేందుకే నిజమైన సంఖ్య కంటే తక్కువ సంఖ్యను చూపిస్తోంది. ఇలా చేస్తే బీసీలకు ముమ్మాటికీ అన్యాయం చేసినట్లే అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. బీసీలకు న్యాయం చేస్తామని గొప్పలు చెబుతూ బీసీ కులగణన చేసింది. కానీ ఈ సర్వేలో బీసీలను విభజించి తక్కువ చేసి చూపిస్తోంది. ఇలా చేయడమంటే బీసీలకు ద్రోహం చేయడమే. రానున్న కాలంలో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుందన్న దురుద్దేశంతోనే ఇలా కులగణన గణాంకాల్లో తప్పుడు లెక్కలు చూపిస్తోంది.
-దిండిగాల రాజేందర్, బీసీ నాయకుడు, బీఆర్ఎస్ సీనియర్ నేత