నిజమైన దేశ భక్తులంటే ఎవరో తెలుసా..? మన దేశాన్ని నిరంతరం కాపుగాస్తున్న మన సైనికులే..! తమ తల్లిదండ్రులూ.. భార్యాపిల్లలకన్నా కూడా వారు అమితంగా ప్రేమించేది ఎవరినో తెలుసా..? ఈ దేశాన్ని, ఈ దేశ ప్రజలను..! దీనికి నిదర్శనంగా నిలిచారు ఆ ఇద్దరు జవాన్లు!
కూసుమంచి, మే 9: మండలంలోని గోరీలపాడుతండాలో శుక్రవారం ఉద్విగ్న వాతావరణం నడుమ.. ‘జై జవాన్’ నినాదాలు మిన్నంటాయి. కూసుమంచి మండలం గోరీలపాడుతండాకు చెందిన బాణోత్ భాస్కర్, తేజావత్ రమేశ్.. 16 ఏళ్లుగా సీఐఎస్ఎఫ్ జవాన్లుగా సేవలందిస్తున్నారు. మధురైలో తేజావత్ రమేశ్, కేరళలో బాణోత్ భాస్కర్ పనిచేస్తున్నారు. ఇద్దరివి వ్యవసాయ కుటుంబాలే. రమేశ్ తండ్రి సామ్య.. పక్షవాతంతో బాధపడుతున్నారు. తండ్రిని చూసేందుకని ఈ నెల 1 నుంచి 22 వరకు రమేష్ సెలవు పెట్టారు.
ఈ నెల 2న తండాకు వచ్చారు. భాస్కర్ కూడా అంతే. ఆయన తండ్రి వాల్య.. కొన్నాళ్ల క్రితం మృతిచెందారు. తల్లి ధస్మి.. పక్షవాతంతో బాధపడుతున్నది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు భాస్కర్ సెలవు తీసుకుని గోరీలపాడుతండాకు గురువారమే (8వ తేదీన) వచ్చారు. ఈ జవాన్లకు శుక్రవారం ఒకేసారి ‘ఎక్స్‌ప్రెస్ మెసేజ్’ వచ్చింది. పాకిస్తాన్‌తో ఆకస్మిక యుద్ధ నేపథ్యంలో తక్షణమే విధుల్లో చేరాలన్నది ఆ మెసేజ్లోని సారాంశం. అప్పటికి రమేష్ వచ్చి వారం అయింది.
భాస్కర్ వచ్చి ఒక్క రోజు కాదు.. ఒక్క పూట కూడా కాలేదు.. ఇంతలోనే ఆ మెసేజ్..! వారు ఏమాత్రం ఆలోచించలేదు. ‘ఆదేశం’ (మెసేజ్) అందుకోగానే అప్పటికప్పుడు తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఈ విషయం తెలియగానే ఆ గ్రామానికి గ్రామమే వారి ఇళ్ల వద్దకు తరలివచ్చింది. ‘అలా వచ్చి.. ఇలా వెళ్తున్నారా..’ అంటూ సానుభూతి చూపించిన గ్రామస్తులతో.. ‘మాకు ఈ దేశం ముఖ్యం. ఈ దేశ రక్షణ ప్రధానం. మా కుటుంబాలను చూసుకునేందుకు మీరంతా ఉన్నారు. ఈ దేశాన్ని, ఈ దేశ రక్షణను మాత్రం మేమే (సైనికులం) చూడాలి’ అని నచ్చజెప్పారు.
దేశ రక్షణకు అంకితమైన ఆ ఇద్దరు జవాన్లను ఆ గ్రామస్తులంతా గర్వంగా చూస్తూ.. ‘జై జవాన్’ అంటూ, ఉద్విగ్న హృదయాలతో బిగ్గరగా నినాదాలిచ్చారు. ‘బిడ్డల్లారా.. వెళ్లి రండి. మీ వాళ్ల బాగోగులను మేం చూసుకుంటాం..’ అంటూ సన్మానించి, మనసారా ఆశీర్వదించారు. ఆ ఇద్దరు సైనికులు, నిజమైన దేశ భక్తులు.. తమ వాళ్ల బాగోగులను గ్రామస్తులకు అప్పగిస్తూ, విజయోత్సాహంతో తిరిగొస్తామంటూ బయల్దేరారు. ‘జై జవాన్’ అంటూ, వారికి కుటుంబీకులు, గ్రామస్తులు ఘనంగా వీడ్కోలు పలికారు.
ఇంటికి వచ్చిన 10 గంటల్లోనే ‘మెసేజ్’ వచ్చింది. వెంటనే విధుల్లోకి రావాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశం. జవాన్‌గా విధుల్లో చేరినప్పుడే.. దేశం కోసం పని చేస్తానని ప్రమాణం చేశా. మా అమ్మ ధస్మికి కొన్ని రోజుల కిందట పక్షవాతం రావడంతో సెలవుపై ఇంటికి వచ్చాను. నేను విధుల్లోకి వెళ్లినా సరే.. మా గ్రామస్తుల్లో ఎవరో ఒకరు మా అమ్మను ఆస్పత్రిలో చూపిస్తారు. ఆ నమ్మకంతోనే సంతోషంగా వెళుతున్నా. ఈ దేశ రక్షణ.. నాకు ప్రధానం. అంతకు మించిన ఆనందం ఇంకోటి ఉండదు. ఇది నాకు గర్వకారణం.
– భాస్కర్
మా నాన్నకు ఇటీవల పక్షవాతం వచ్చింది. ఆయనను చూసేందుకు, ఆస్పత్రిలో చూపించేందుకు సెలవుపై ఈ నెల 2న ఇంటికి వచ్చా. ఈ రోజే (శుక్రవారం) ‘మెసేజ్’ వచ్చింది. మా నాన్నను చూసుకునేందుకు వీళ్లు (గ్రామస్తులు) ఉన్నారు. ఇప్పుడున్న యుద్ధ పరిస్థితుల్లో మాపై (సైనికులపై) కీలక బాధ్యత ఉంది. మాకు మీరంతా ఉన్నారు. మీ కోసం (దేశం కోసం) మేమంతా ఉన్నాం. మీ అందరి ప్రేమాభిమానాలు చూస్తుంటే.. మాకు ఎంతో సంతోషంగా ఉంది. మనదే విజయం.. విజయోత్సాహంతో తిరిగొస్తాం.
– రమేష్