ఖమ్మం/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, అక్టోబర్ 18 ; ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా శనివారం బీసీల బంద్ సక్సెస్ అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలనే డిమాండ్‌తో బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్‌లో భాగంగా బీసీ సంఘాలు గర్జించాయి. వాణిజ్య సముదాయాలు, పెట్రోల్‌బంక్‌లు, విద్యాసంస్థలు, సినిమాహాల్స్ తెరుచుకోలేదు.. ఆర్టీసీ బస్సులు తిరగలేదు.. మధ్యాహ్నం వరకు ఆటోలు సైతం కదలలేదు.. దీంతో జనజీవనం స్తంభించింది.
ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీల జనాభా ఎంతో… అంతే వాటా కావాలని, బీసీ కులాలకు 42శాతం రిజర్వేషన్లు ఖరారు చేయాల్సిందేనని ధ్వజమెత్తారు. పాలకుల కుట్రలను సహించేది లేదని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. 42శాతం రిజర్వేషన్లు ఇవ్వకుంటే తెలంగాణ ఉద్యమం తరహాలో రాష్ట్రంలో మరో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుందని హెచ్చరించారు. బంద్‌లో బీసీ సంఘాలతోపాటు బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్, న్యూడెమోక్రసీ, కాంగ్రెస్, బీజేపీ, ఎస్సీ, ఎస్టీ కులసంఘాల నాయకులు మద్దతుగా పాల్గొన్నారు.