చుంచుపల్లి, జూలై 16 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని రామాంజనేయ కాలనీలో ఓ యువకుడిపై జరిగిన దాడి స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం, రామాంజనేయ కాలనీకి చెందిన రాహుల్‌కు అదే ప్రాంతానికి చెందిన ఉదయ్‌తో సుమారు పది రోజుల క్రితం గొడవ జరిగింది. ఆ ఘటనకు కొనసాగింపుగా గురువారం రాత్రి ఉదయ్ తనతో పాటు మరో పదిమంది యువకులతో కలిసి రాహుల్ ఇంటి వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో కారులో ఉన్న రాహుల్‌ను బయటకు పిలిపించి పాత గొడవను ప్రస్తావిస్తూ విచక్షణారహితంగా దాడి చేసినట్లు సమాచారం. దుండగులు రాహుల్‌పై పిడిగుద్దులతో దాడి చేయడంతో పాటు అతడి కారుపై కూడా దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు.
ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురై వెంటనే డయల్-100కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన రాహుల్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై చుంచుపల్లి ఎస్ఐ రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి గల పూర్తి కారణాలు, ఘటనలో పాల్గొన్న ఇతర యువకుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పాత గొడవ నేపథ్యంలో కారు అద్దాలు పగలగొట్టి యువకుడిపై దాడి