కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 25 : ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను అక్టోబర్ 11, 12 తేదీల్లో నల్లగొండ జిల్లాలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కామ్రేడ్ అందే మంగ విజయ్ తెలిపారు. గురువారం కొత్తగూడెం పట్టణంలోని రైటర్ బస్తీ ఐఎఫ్టీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. సనాతన ధర్మం పేరుతో మహిళల్ని ఇంటికే పరిమితం చేయడం కోసం ఉద్యోగాల్లో రాణించకుండా, రిజర్వేషన్ల కోసం కొట్లాడకుండా, సాధించుకున్న హక్కులను హరించే విధంగా ఈ పాలకులు హిందూ భావజాలాన్ని ఎక్కిస్తున్నారని ఆమె ఆరోపించారు. మణిపూర్ రాష్ట్రంలో సుగంధ ద్రవ్యాల కోసం జరిగిన పోరాటంలో మహిళలను నగ్నంగా ఊరేగించి, హింసించి దాడులు చేసి విధ్వంసం సృష్టించినట్లు తెలిపారు.
మరోపక్క ఏజెన్సీలో ఆదివాసి మహిళలపై అత్యాచారాలు, మారణ హోమం సృష్టిస్తున్నారని, సైన్యాలతో బెదిరిస్తున్నారని, ఎదురు తిరిగిన వారిని బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో కాల్చి చంపుతున్నారని ఆమె మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మహిళలను చైతన్యం చేయడం కోసం ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 11,12 తేదీల్లో నల్లగొండ జిల్లా నడి బొడ్డున రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు, వీటికి మహిళలు విద్యార్థినులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాజేశ్వరి, నాగలక్ష్మి, సంధ్య, రాములమ్మ, కరుణ, రాధ, వెంకటమ్మ, సుప్రియ పాల్గొన్నారు.