ఇల్లందు, మార్చి 14: ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై నిలదీస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తట్టుకోలేక అక్రమ అరెస్టులకు పాల్పడుతుందని ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు దిండిగాల రాజేందర్ అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్టులా? ఇది ప్రజా పాలన కాదని నియంతృత్వ పాలన అని అన్నారు. గురువారం శాసనసభ సమావేశాల నుంచి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డిని సమావేశాల నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రాజేందర్ ఆధ్వర్యంలో ఇల్లెందు పట్టణం జగదాంబ సెంటర్ తెలంగాణ తల్లి చౌరస్తా రేవంత్ రెడ్డి ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
కాగా ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుని రాజేందర్‌తో పాటు ఉద్యమ నాయకులు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ అజ్మీర బావ్‌సింగ్, ఆదూరి రవిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. దీంతో పోలీసుల చర్యను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. వారిని కూడా పోలీసులు స్టేషన్‌కి తరలించారు. అక్రమ అరెస్టును నిరసిస్తూ టీబీజీకేఎస్ నాయకుడు రంగనాథ్ మాట్లాడుతూ.. ఒక గొంతు నొక్కినంత మాత్రాన పోరాటం ఆగదన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలపై ఇటు తమ ఎమ్మెల్యేలు సభలో, పార్టీ శ్రేణులమైన తాము బయట ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉంటామని హెచ్చరించారు. రాబోయే కాలంలో ప్రజా కోర్టులో కాంగ్రెస్ పార్టీకి శిక్ష తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకుడు సిలివేరి సత్యనారాయణ, పార్టీ సోషల్ మీడియా విభాగం& యూత్ విభాగం ఎంటెక్ మహేందర్, కాసాని హరిప్రసాద్, లలిత్ పాసి, సత్తాల హరికృష్ణ, మండల నాయకులు సురేశ్, పట్టణ కమిటీ చాంద్ పాషా, నారపాక వసంత, మునిగంటి శివ పాల్గొన్నారు.