– బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్
ఇల్లెందు, మే 09 : అకాల వర్షాలకు తడిసిన మొక్కజొన్నను ప్రభుత్వమే ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్ డిమాండ్ చేశారు. శనివారం ఇల్లెందు మండలం రేపల్లెవాడ కొనుగోలు కేంద్రాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు మండల మాజీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి తడిసిన మొక్కజొన్నను పరిశీలించారు. రైతులతో కలిసి కొనుగోలు కేంద్రం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దిండిగల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సకాలంలో ధాన్యం సేకరించటం లేదని, ధాన్యం తెచ్చి రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందన్నారు. సరైన వసతులు లేక టార్బాలిన్లు లేక ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం తడిసిపోతున్నా పట్టించుకునే నాథుడు లేడన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనడం లేదని, గన్ని బ్యాగ్స్ సరఫరా చేయడం లేదని, మార్కెట్ లో దళారీలు రాజ్యం ఏలుతున్నారని, రైతుల పొట్టగొట్టి లాభలు గడిస్తున్నారని, మార్కెర్ కమిటీ అధికారులు దళారీలకే కొమ్ముగాస్తున్నట్లు తెలిపారు.

‘తడిసిన మొక్కజొన్నను షరతులు లేకుండా కొనుగోలు చేయాలి’
కేసీఆర్ ముఖమంత్రిగా ఉన్నప్పుడు ఈ బాధలు లేవని, గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ధాన్యం సకాలంలో కొన్నారని, తడిసినా, రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనేవారని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక రైతుల కష్టాలు పెరిగిపోయాయని, రైతుబంధు రాదు, విత్తనాలు దొరకవు, యూరియా దొరకదు, ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటినా చేతలు గడప దాటడం లేదని విమర్శించారు. వెంటనే మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్, పీఏసీఎస్ సీఈఓ తో మాట్లాడి రైతులకు న్యాయం చేయాలని, ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని, దళారీలను అరికట్టాలని లేకుంటే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అబ్దుల్ జబ్బర్, అబ్దుల్ నబీ, మాజీ వైస్ ఎంపీపీ ప్రమోద్, డేరింగుల పోషం, మాజీ కో ఆప్షన్ మెంబర్ ఘాజి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మూడు కృష్ణ ప్రసాద్, సత్యనారాయణ, నారపాక వసంతరావు, స్థానిక సర్పంచులు యేపే శంకర్, ఎట్టి రమణ, ఉద్యమకారులు ఆధురి రవి, రాంలాల్ పాసి, రాచపల్లి శ్రీను, సుందరి శ్రీను, వాసు, సునీల్, మూలగుండ్లు ఉపేందర్ రావు, లలిత్ కుమార్ పాసి, శ్రీకాంత్, హరిప్రసాద్ యాదవ్, సురేష్, కామేపల్లి ఉదయ్, గడ్డి శ్రీను, చిన్నారి, ముత్తయ్య, రాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.