భద్రాద్రి కొత్తగూడెం. జూలై 23 : భద్రాచలం ఆలయ నిర్మాణం పనులు పుష్కరాలు కల్లా 60 శాతం పూర్తి చేస్తామని రాష్ట్ర దేవాదాయ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. గురువారం భద్రాచలం రామాలయం పనులను పరిశీలించి ఆయన పాల్వంచ పెద్దమ్మ తల్లి కొత్తగూడెం గణేష్ టెంపుల్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడారు. భద్రాద్రి జిల్లాలో ఆలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో గణేష్ టెంపుల్ అభివృద్ధి చేయడం కోసం నిధులు ఇస్తామని, సిబ్బంది కొరత లేకుండా కొత్తవారిని నియమించే కార్యక్రమం కూడా చేపడతామన్నారు. పెండింగ్ లో ఉన్న ఆలయ భూములు విషయంలో స్పీడ్ పెంచుతామని కోర్టులో పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎంతోకాలంగా కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కోట్ల విలువైన భూమి గతంలో సినిమా హాల్ నిర్మాణం చేపట్టారని దాని విషయంలో పరిష్కారం చేసుకుంటామన్నారు. అంతకుముందు గణేష్ టెంపుల్ ఈవో రజనీకుమారి, ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు.