కొత్తగూడెం అర్బన్, మే 17 : రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అఖిల భారత ఐక్య రైతు సంఘం కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి జాటోతు కృష్ణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కల్లూరి కిశోర్ అన్నారు. శనివారం పట్టణంలోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన డివిజన్ మహాసభలో వారు మాట్లాడారు. జిల్లాలోని రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు నిర్వహించామని, రానున్న రోజుల్లో సమరశీల పోరాటాలకు సిద్దమవ్వాలని పిలుపునిచ్చారు. కల్తీ విత్తనాలు, ఎరువులను నివారించాలని, మార్కెట్ సౌకర్యాలు కల్పించాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర దక్కేలా పార్లమెంట్లో చట్టం చేయాలని, కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అఖిల భారత ఐక్య రైతు సంఘం మహాసభలను దమ్మపేట మండలం దమ్మపేటలో ఈ నెల 24, 25న నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహాసభలను విజయవంతం చేయాలని రైతాంగ వర్గానికి వారు పిలుపునిచ్చారు. జిల్లాలో గిరిజన, ఇతర పేదలు పోడు కొట్టుకుని సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు కల్పించి, ఆ భూములకు విద్యుత్, సాగునీరు సౌకర్యాలు కల్పించాలన్నారు.
ఈ మహాసభలో ఐక్య రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి.ధర్మ, టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షుడు వై.గోపాలరావు, జిల్లా సహాయ కార్యదర్శి పి.సతీశ్, పీయూసీఐ మండల నాయకుడు రాయల సిద్దు, ఐక్య రైతు సంఘం నాయకులు బైరి వెంకన్న, చింతా వెంకటేశ్వర్లు, లింగాల వీరభద్రం, తోటకూరి, నరేశ్, మండల నాయకులు జోగ సారయ్య, వెంకన్న, నరేశ్, కేశవరావు, వై..నాగభూషణం, గడ్డం రామచంద్రయ్య, ఎట్టి లక్ష్మి, చోటు, కుమారి, సుశీల, ఎట్టి నరసింహారావు, వెంకటమ్మ, పాపమ్మ పాల్గొన్నారు.