ఇల్లెందు, అక్టోబర్ 10 : మానసిక దివ్యాంగుల పట్ల ఉదార స్వభావం కలిగి ఉండాలని జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇల్లెందు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక మిషన్ స్కూల్ వద్ద గిరిజన బాలికల వసతి గృహం నందు న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్జి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మానసిక రోగుల పట్ల ఉదారత స్వభావం కలిగి ఉండాలని, సేవా భావంతో మెలగాలన్నారు. సంఘంలో గాని, కుటుంబంలో గానీ, విద్యార్థిని విద్యార్థుల్లో గాని, అలాంటి వ్యక్తులు ఉన్నట్లయితే వారికి సాయం అందించాలన్నారు.
అలాంటి వ్యక్తులు కనబడితే వీలైతే సహాయం అందించాలని, లేదా వారి సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ (14416) కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లయితే సంబంధింత అధికారులు వచ్చి వారిని సంరక్షణ కేంద్రానికి తీసుకువెళ్లి వారి బాగోగులు చూసుకుంటారని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థిని, విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా శారీరక వ్యాయామాలు, క్రీడలు ఆడాలన్నారు. విద్యార్థినులకు గేమ్స్ కిట్ అందజేసి పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లెందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.ఉమామహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కీర్తి కార్తీక్, హాస్టల్ వార్డెన్ జ్యోతి, సిబ్బంది పాల్గొన్నారు.