కొత్తగూడెం, జూన్ 25 : మాదక ద్రవ్యాల రహిత సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ అవగాహన వారోత్సవాల్లో భాగంగా బుధవారం సుజాతనగర్ పోలీసుల ఆధ్వర్యంలో ధన్వంతరీ ఫార్మసీ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల దృష్టి తమ భవిష్యత్, జీవిత లక్ష్యంపై మాత్రమే ఉండాలని, మత్తు పదార్థాల పట్ల విద్యార్థులు, యువత ఆకర్షితులు కావొద్దన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.
గంజాయి, డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేయడంతో పాటు, భవిష్యత్‌ను అంధకారం చేస్తాయన్నారు. విద్యార్థులు, యువత గ్రహించి అలాంటి చెడు అలవాట్లకు ఆకర్షితులు కావొద్దన్నారు. మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత, విద్యార్థులు యాంటీ డ్రగ్స్ కమిటీలో సభ్యులుగా చేరి, యాంటీ డ్రగ్స్ సోల్జర్ గా సహకరించాలని తెలిపారు. యువత ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ, వారు ఎలాంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా చూడాలన్నారు. మీ ప్రాంతాల్లో ఎక్కడైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు, తాగుతున్నట్లు తెలిస్తే వెంటనే సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందివ్వాలన్నారు.
సదస్సు అనంతరం కళాశాల ఆవరణలో ఎస్పీ మొక్కను నాటారు. విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది ఎస్పీని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, కొత్తగూడెం టూ టౌన్ సీఐ ప్రతాప్, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, వన్ టౌన్ సీఐ కరుణాకర్, త్రి టౌన్ సీఐ శివప్రసాద్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ రాము, సుజాతనగర్ ఎస్ఐ ఎం.రమాదేవి, కళాశాల చైర్మన్ అరికెల భాస్కర్, ప్రిన్సిపాల్ ఏ.నాగరాజు, అధ్యాపక సిబ్బంది, సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
Kothagudem : మాదకద్రవ్య రహిత సమాజ స్థాపనలో భాగస్వాములు కావాలి : ఎస్పీ రోహిత్ రాజు