జూలూరుపాడు, మార్చి 21 : అమెరికా సామ్రాజ్యవాదాన్ని, బీజేపీ మతోన్మాదాన్ని ప్రజలంతా తిప్పికొట్టాలని సీపీఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు అన్నారు. జూలూరుపాడు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. డోనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికా ప్రపంచ వాణిజ్య యుద్ధం చేస్తుందని, అందులో భాగంగానే భారతదేశం మీద కూడా సుంకాలు విధిస్తున్నట్లు తెలిపారు.
అమెరికాలోని భారత పౌరులను బానిసలుగా చూస్తూ, సంకెళ్లు వేసి తీసుకొస్తున్నా ప్రధాని మోదీ చేష్టలుడిగి చూస్తున్నట్లు దుయ్యబట్టారు. అమెరికా అహంకారపూరిత నిర్ణయాలను కనీసం ప్రశ్నించే ప్రయత్నం చేయడం లేదన్నారు. భగత్ సింగ్ బలిదానం స్ఫూర్తితో అమెరికా సామ్రాజ్యవాదాన్ని, బీజేపీ మతోన్మాద, కార్పొరేట్ విధానాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొండపల్లి శ్రీధర్, మండల కార్యదర్శి యాసా నరేశ్, వెంకటి చందర్, రాములు, బానోతు ఈశ్వర్ పాల్గొన్నారు.