– సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు
కొత్తగూడెం గణేష్ టెంపుల్, జూలై 20 : నీట్ పేపర్ లీకుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని, విద్యార్థుల భవిష్యత్ కోసం నిరాహార దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్ చుక్ తో చర్చలు జరిపి దీక్షను విరిమింపచేసేలాగా ప్రభుత్వ చర్యలు ఉండాలని సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు అన్నారు. ఢిల్లీలో సిజెపి, విద్యార్థి సంఘాలు తలపెట్టిన పార్లమెంటు ర్యాలీ, ధర్నాకు సంఘీభావం తెలుపుతూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఇరవై మూడు రోజుల నుండి సామాజిక కార్యకర్త వాంగ్ చుక్ నిరాహార దీక్ష చేస్తుంటే కనీసం ప్రభుత్వం స్పందించకపోగా బలవంతంగా దీక్షను భగ్నం చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన విమర్శించారు.
నీట్ పరీక్ష పేపరు లీకు అవడం వలన ఇరవై రెండు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ అంధకారంలోకి నెట్టి వేయబడిందని దీనికి బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం బాధ్యత వహించకపోగా విద్యార్థులకు న్యాయం చేయమని అడుగుతున్నందుకు నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని విమర్శించారు. మనిషి ప్రాణాలు కన్నా విద్యార్థుల భవిష్యత్తు కన్నా మోదీ ప్రభుత్వానికి వారి పదవుల పైనే మక్కువ ఎక్కువ ఉందని విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు నిరసన తెలియజేసే హక్కు రాజ్యాంగం కల్పిస్తే రాజ్యాంగానికి తోట్లు పొడిచే విధంగా ప్రజాస్వామ్య హక్కులను నిర్బంధాలతో మోదీ ప్రభుత్వం కాల రాస్తోందని దుయ్యబట్టారు. విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా ఇవ్వలేని ప్రభుత్వం వారి నిరసనలు మాత్రం తమ అధికార యంత్రాంగం ద్వారా పోలీసులు ద్వారా అణిచివేసే పని చేస్తుందని విమర్శించారు.
ఢిల్లీలో శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జి బాసుపవాయువు వాటర్ కెనాల్ వంటివి ఉపయోగించి ఉద్యమాన్ని నిర్బంధంతో నిలిపివేసే కుట్రలు చేసిందని విమర్శించారు. నిర్బంధాలతో యువతలో వచ్చిన ఆవేశ ఆగ్రోశాలను ఆపడం మోడీ తరం కాదని కచ్చితంగా ఈ దేశ యువత మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లిక్కి బాలరాజు, నాయకులు భూక్య రమేష్ , సందకూరి లక్ష్మీ నందిపాటి రమేష్ నాయకులు విజయగిరి శ్రీనివాస్ ఎం ఎస్ ప్రకాష్ గడల నరసింహారావు రమేష్ బాబు బాలకృష్ణ రాములు రఘు పాల్గొన్నారు.