రుద్రంపూర్, జూన్ 18 : కృషి విజ్ఞాన కేంద్రం, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో ఎస్బీఐ ఆర్థిక సహకారంతో భారతీయ వరి పరిశోధనా సంస్థ సాంకేతిక సహకారంతో నేరుగా వరి వెదజల్లు (డైరెక్ట్ సీడెడ్ రైస్) సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ డా.టి.భరత్ మాట్లాడుతూ.. సీడ్ డ్రిల్ లేదా డ్రమ్ సీడర్ ద్వారా వరి వెదజల్లి సాగు చేయడం వల్ల రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గడంతో పాటు తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. ఈ విధానం పర్యావరణ పరిరక్షణకు కూడా దోహద పడుతుందన్నారు.
రైతులు తప్పనిసరిగా మట్టి పరీక్షలు చేయించుకుని, వాటి ఫలితాల ఆధారంగా అవసరమైన మోతాదులోనే ఎరువులు వినియోగించాలని సూచించారు. అధికంగా ఎరువులు వాడటం వల్ల భూసారం తగ్గిపోతుందని హెచ్చరించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న వరి రకాలను సాగు చేయాలని, ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన డబ్ల్యూజీఎల్-44 (సిద్ధి), కేఎన్ఎం-1638 రకాల సాగుతో మెరుగైన దిగుబడులు పొందవచ్చని తెలిపారు.
ఉద్యాన శాస్త్రవేత్త శివ మాట్లాడుతూ.. రైతులు పంటల మార్పిడి విధానాన్ని అవలంబించాలని సూచించారు. ఆయిల్ పామ్, మునగ, పందిరి పద్ధతిలో తీగజాతి కూరగాయల సాగు ద్వారా స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చని వివరించారు. భారతీయ వరి పరిశోధనా సంస్థ డీఎస్ఆర్ ప్రాజెక్టు ఇన్చార్జి కవిరాజ్ నేరుగా వరి వెదజల్లు సాగు పద్ధతులు, నిర్వహణపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం గిరిజన ఉప ప్రణాళిక పథకం కింద 50 మంది రైతులకు బ్యాటరీ స్ప్రేయర్లు, టార్పాలిన్ పట్టాలు, పత్తి తీత బ్యాగులను పంపిణీ చేశారు. అలాగే ముగ్గురు రైతులకు జింక్ పోషకాలతో సమృద్ధిగా ఉన్న వరి వంగడమైన ధన్-44 విత్తనాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, కృషి విజ్ఞాన కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

వరి వెదజల్లు సాగుపై రైతులకు అవగాహన