– మెడికల్ బోర్డు కోసం ఎదురుచూస్తున్న కార్మికులను 100 శాతం అన్‌ఫిట్ చేయాలి
– టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన
– కార్మిక కుటుంబాల భవిష్యత్‌తో చెలగాటమాడొద్దు : కాపు కృష్ణ
రుద్రంపూర్, సెప్టెంబర్ 01 : సింగరేణిలో అనారోగ్యంతో బాధపడుతూ మెడికల్ బోర్డు కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) డిమాండ్ చేసింది. ప్రతి నెల క్రమం తప్పకుండా కనీసం మూడు మెడికల్ బోర్డులను నిర్వహించి, మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన కార్మికులందరికీ న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. కొత్తగూడెం ఏరియా పరిధిలోని ఉద్యోగులు టీబీజీకేఎస్ నాయకుడు గడప రాజయ్య ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సుదీర్ఘకాలంగా మెడికల్ బోర్డు కోసం ఎదురు చూస్తున్న కార్మికుల ఆవేదనను యాజమాన్యం, ప్రభుత్వం గుర్తించాలని, వారి ఆరోగ్య పరిస్థితి, కుటుంబాల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తక్షణమే మెడికల్ బోర్డుల నిర్వహణను క్రమబద్ధీకరించాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా టీబీజీకేఎస్ రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ మాట్లాడుతూ.. సింగరేణిలో 1998లో రద్దు చేసిన డిపెండెంట్ ఉద్యోగాల స్థానంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో కారుణ్య నియామకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ విధానం ద్వారా వేలాది కార్మిక కుటుంబాలకు ఉపాధి అవకాశాలు లభించాయని పేర్కొన్నారు. కారుణ్య నియామకాల అమలులో భాగంగా 14 వేల మందికి పైగా కార్మికులు మెడికల్ ఇన్‌వ్యాలిడేట్ కావడం ద్వారా వారి కుటుంబాల్లోని అర్హులకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడటంతో అనేక కుటుంబాలకు న్యాయం జరిగిందని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికుల్లో 80 శాతానికి పైగా అన్‌ఫిట్ అవుతున్నారని, నెలకు రెండు మెడికల్ బోర్డులు మాత్రమే నిర్వహిస్తున్నారని అప్పట్లో కాంగ్రెస్ పార్టీతో పాటు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ కార్మిక సంఘాలు తీవ్ర విమర్శలు చేశాయని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలపై అప్పట్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆయా సంఘాలు, ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులందరికీ నూటికి నూరు శాతం న్యాయం చేస్తామని, ప్రతి నెల కనీసం మూడు మెడికల్ బోర్డులు నిర్వహిస్తామని హామీలు ఇచ్చాయని ఆయన గుర్తు చేశారు.
అయితే ఎన్నికల హామీలు అమలులో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మెడికల్ బోర్డుల నిర్వహణలో జాప్యం కొనసాగుతోందని, గత సుమారు 15 నెలల కాలంలో క్రమం తప్పకుండా బోర్డులు నిర్వహించలేదని విమర్శించారు. ప్రస్తుతం మెడికల్ బోర్డుకు హాజరవుతున్న కార్మికుల్లో అన్‌ఫిట్ అవుతున్న వారి శాతం కూడా గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గిపోయిందని ఆరోపించారు. మెడికల్ బోర్డు ఎప్పుడు నిర్వహిస్తారో తెలియక నెలల తరబడి ఎదురు చూస్తున్న కార్మికుల సర్వీసు కాలం పూర్తవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులు ఒకవైపు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే, మరోవైపు మెడికల్ బోర్డు కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడటం అత్యంత బాధాకరమని అన్నారు. కార్మికుడు సేవలో ఉండి అనారోగ్యంతో పనిచేయలేని పరిస్థితికి చేరుకున్నప్పటికీ, బోర్డు నిర్వహణలో జాప్యం కారణంగా కుటుంబం భవిష్యత్తు అనిశ్చితిలో పడుతోందని పేర్కొన్నారు.
మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులందరి పరిస్థితులను సత్వరమే పరిశీలించి, అర్హులైన వారికి న్యాయం చేయాలని కాపు కృష్ణ డిమాండ్ చేశారు. ప్రతి నెల క్రమం తప్పకుండా కనీసం మూడు మెడికల్ బోర్డులను నిర్వహించడం ద్వారా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. మెడికల్ బోర్డు కోసం ఎదురుచూస్తున్న కార్మికుల కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ ప్రక్రియలో ఎటువంటి జాప్యానికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్మికుల ఆరోగ్యం, కుటుంబాల భవిష్యత్తు కంటే నిర్లక్ష్యం పెద్దది కాదని, సింగరేణి యాజమాన్యం తక్షణమే స్పందించి మెడికల్ బోర్డుల నిర్వహణపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని టీబీజీకేఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం మైన్ మేనేజర్లు, ఆయా విభాగాల హెచ్ఓడీలకు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గడప రాజయ్య, కాగితపు విజయ్ కుమార్, బూర్గుల రవికుమార్, సంతోష్, నిశాంత్, నమిల్ల వెంకటేశ్వర్లు, అలీమ్ పాషా, వినీత్, అజీజ్, అజీమ్, బాలాజీ, అన్వర్ పాషా, నవీన్, శంకర్, వెంకట్రావు, అనుదీప్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.