జూలూరుపాడు, డిసెంబర్ 26 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి సోయిలేని, పస లేని విమర్శలు అని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు. జూలూరుపాడు మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి పూర్తిగా బూతు మాటలకే పరిమితమై, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. కొడంగల్లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రానికి దిశానిర్దేశం చేయాల్సిన ముఖ్యమంత్రే, ఇలా అనుచిత వ్యాఖ్యలతో వివాదాలు సృష్టించడం దురదృష్టకరమన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలెన్ని రెండేండ్ల పాలనలో నెరవేర్చినవి ఎన్ని అని ఆయన ప్రశ్నించారు. హామీల గురించి ప్రశ్నించిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై వ్యక్తిగత దూషణలకు దిగడం రేవంత్ రెడ్డి దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన సమయంలో ప్రజలు రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెబుతారన్నారు.