– ఎస్పీకి మహిళా సంఘం బృందం వినతి
కొత్తగూడెం అర్బన్, ఆగస్టు 25 : ఆదివాసీ బాలికకు మద్యం తాగించి అత్యాచారం చేసిన ఆటో డ్రైవర్, ఇతర వ్యక్తులను అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు పెద్దగ్రోని ఆదిలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం కొత్తగూడెం ఐఎఫ్టీయూ కార్యాలయంలో జరిగిన ప్రగతి శీల మహిళా సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆదివాసి బాలిక బంధువుల ఇంటికి వెళ్లి వస్తూ తన రక్త సంబంధీకుల దగ్గరికి పోదామని కుంట బస్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో కొంతమంది ఆటోలో వచ్చి మాయమాటలతో ఆటోలో ఎక్కించుకుని మద్యం తాగించి బాలికపై అత్యాచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
మహిళలు ఒంటరిగా పనులకు, బయటకు వెళ్లాలన్నా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆరు నెలల పాప నుండి 60 ఏళ్ల వృద్ధుల వరకు అత్యాచారాలు, వేధింపులు, హత్యలు పెరిగిపోతున్నాయని, ఎంతోమంది మహిళలు వేధింపులకు గురై బయటకు చెప్పుకోలేకపోతున్నారని అవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతి శీల మహిళా సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కల్తీ కోటమ్మ, వెంకటమ్మ, సంధ్య, రాధ, రమ్య, జానకి, మంగమ్మ, వనజ పాల్గొన్నారు.
Kothagudem Urban : ‘ఆదివాసి బాలికపై అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి’